
-
ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్ కు కొత్త విషయాలు గుర్తొస్తాయి
-
కలెక్టర్ల అధికారాలు మంత్రులకివ్వడమా?
-
కేసీఆర్ కు పాలనపై అవగాహనే లేదు
-
మంత్రులను డమ్మీలు చేసి ఇష్టారాజ్యం చేయాలనుకుంటున్నారు
-
IAS అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది
-
రాష్ట్ర కాంగ్రెస్ నేతల విమర్శలు
హైదరాబాద్ : ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త విషయాలు గుర్తొస్తాయని అన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. అవినీతి గ్రామీణ వ్యవస్థల గురించి ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఐదేళ్ల పాలన తర్వాత ఇప్పుడు రెవెన్యూ అధికారుల అవినీతి గుర్తుకొచ్చిందా .. అని ఆయన ప్రశ్నించారు. MPTC, ZPTC ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారనీ.. అందుకే రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంటున్నారని విమర్శించారు మల్లు రవి.
MPTC, ZPTC ఎన్నికల్లో కేసీఆర్ కు గుణపాఠం తప్పదన్నారు మల్లురవి. పార్లమెంట్ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగిందనీ.. అది కాంగ్రెస్ కే లాభం కలిగిస్తుందని ఆయన అన్నారు.
పాలనపై కేసీఆర్ కు అవగాహన లేదు : DK సమర సింహారెడ్డి
మంత్రులు, ముఖ్యమంత్రులు తాము ఇష్టం వచ్చినట్లుగా చట్టాలు చేస్తామంటే చట్టం ఒప్పుకోదని… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే సమరసింహా రెడ్డి అన్నారు. పాలనపై కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కలెక్టర్ల అధికారాలను మంత్రులకు అప్పగిస్తానడం సరికాదన్నారు. కలెక్టర్ల అధికారాలను మంత్రులకు కట్టబెట్టి.. డమ్మీ మంత్రులతో.. పరోక్షంగా తాను అధికారం చెలాయించాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. “ఇప్పటికే కేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ట్రం అతలాకుతలం అయింది. గతంలో NTR ఇలాంటి నిర్ణయాలు చేసి కోర్ట్ చీవాట్లు తిన్నాడు. రాజ్యాంగానికి అతీతంగా ఎవరు నిర్ణయాలు చెయ్యడానికి లేదు. కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన సాగించాలి. ఇష్టమొచ్చినట్లు చేస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. ఐఏఎస్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ శాఖను పంచాయితీ రాజ్ లో విలీనం చేస్తే….. గ్రామాల్లో రాజకీయ జోక్యాన్ని ప్రోత్సహించడమే అవుతుంది” అన్నారు డీకే సమర సింహారెడ్డి.