- 12 స్థానాల్లో పదింటిలో కాంగ్రెస్ క్యాండిడేట్లదే విజయం
- సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ ఓడగొట్టిన ఓటర్లు
- ఒక్క సీటూ గెలవని బీజేపీ, ప్రభావం చూపని ఇండిపెండెంట్లు
వరంగల్/హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సునామీ సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంది. కనీసం పోటీ ఇస్తారో లేదో అనుకునే నియోజకవర్గాల్లోనూ హస్తం అభ్యర్థులు సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ తప్ప మిగతా 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.
ఏదేమైనా తమ విజయం ఖాయమని భావించిన నాలుగైదు స్థానాల్లో సైతం అధికార పార్టీ ఓడిపోయింది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లకు 10 వేల నుంచి 20 వేల మెజార్టీ రావడం గమనార్హం. కాంగ్రెస్ తరపున హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని పరకాలలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్‌ఈస్ట్ కొండా సురేఖ, వెస్ట్‌లో నాయిని రాజేందర్‌రెడ్డి, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి, వర్ధన్నపేటలో కేఆర్.నాగరాజు, ములుగులో సీతక్క, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావు, మహబూబాబాద్‌లో మురళీ నాయక్, డోర్నకల్‌లో రామచంద్రునాయక్, పాలకుర్తిలో యశస్వినిరెడ్డి విజయం సాధించగా, బీఆర్‌ఎస్ నుంచి జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి మాత్రమే గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక్క జనగామ జిల్లా తప్ప మిగతా ఆరు జిల్లాల్లో బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.
ఓడిన బీఆర్‍ఎస్ సిట్టింగ్‌లు
ఉమ్మడి జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ తప్ప మిగతా నియోజకవర్గాల్లో అధికార పార్టీ తరఫున సిట్టింగ్‌లకే మరోసారి అవకాశం ఇచ్చారు. క్యాండిడేట్లను మార్చిన జనగామ, ఘన్‌పూర్‌లో తప్పితే మిగతా నియోజకవర్గాల్లో అధికార పార్టీ క్యాండిడేట్లు ఓడిపోవడం గమనార్హం. ములుగులో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క మరోసారి విజయం సాధించారు.
కాంగ్రెస్‌లో జోష్
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజవకర్గాల్లో కాంగ్రెస్ 50 వేలకుపైగా మెజార్టీ సాధించడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. మానుకోటలో 2009లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లోన బీఆర్‌ఎస్ గెలుపొందగా ఈ సారి ఫస్ట్‌టైం ఎన్నికల బరిలోకి దిగిన భూక్యా మురళీనాయక్ బానోతు శంకర్‌నాయక్‌పై 50,171 ఓట్ల మెజార్టీతో గెలిచారు. డోర్నకల్‌లో డీఎస్ రెడ్యానాయక్ ఏడు సార్లు గెలిచారు. బీఆర్‌ఎస్ క్యాండిడేట్‌గా 8వ సారి ఎన్నికల బరిలో నిలిచి ఘోర పరాజయం పొందారు. కాంగ్రెస్ నుంచి డోర్నకల్ అభ్యర్థిగా జాటోతు రామచంద్రునాయక్ 53,131 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
సిట్టింగ్‌లను మార్చిన చోటే విన్నింగ్
జనగామ, వెలుగు : రాష్ట్రంలో దాదాపుగా సిట్టింగ్‌లకే ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లను మార్చి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ రెండు స్థానాలే బఆర్‌ఎస్‌కు దక్కగా, మిగతా అన్ని చోట్ల సిట్టింగ్‌లు ఓడిపోయారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి 15,783 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ఇక స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన్ను కాదని కడియంకు టికెట్ ఇచ్చారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు చేసినఅభివృద్ధి పనులు, తెలంగాణ ఏర్పాటయ్యాక డిప్యూటీ సీఎంగా కార్యకర్తలతో నడుచుకున్న తీరు, అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్సీ నిధుల కేటాయింపుతో నాయకులు, ప్రజలు కడియం వైపు మొగ్గు చూపారు. ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్ సింగపురం ఇందిరపై 7,779 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
అన్ని రౌండ్లలోనూ ఆధిక్యమే...
జయశంకర్ భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్/శాయంపేట/ములుగు/ఏటూరునాగారం, వెలుగు : భూపాలపల్లి నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ జెండాఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు 52 వేల ఓట్లకు పైగా మెజార్టీతో బీఆర్‌ఎస్ క్యాండిడేట్ గండ్ర వెంకటరమణారెడ్డిపై గెలిచారు. గండ్ర సత్యనారాయణరావు మొదటి నుంచే మెజార్టీ సాధించడంతో ఫస్ట్ రౌండ్ ముగియగానే బీఆర్‌ఎస్ క్యాండిడేట్ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు.
ఐదో రౌండ్ ముగిసే సరికే కాంగ్రెస్ క్యాండిడేట్‌కు 10 వేల మెజార్టీ వచ్చింది. నియోజకవర్గంలోని మొత్తం 8 మండలాల్లోనూ వెంకటరమణారెడ్డికే మెజార్టీ దక్కింది. మరో వైపు బీజేపీ క్యాండిడేట్ చందుపట్ల కీర్తిరెడ్డికి 14, 731 ఓట్లు రాగా, డిపాజిట్ సైతం కోల్పోయారు. ఇక ములుగులో కాంగ్రెస్ క్యాండిడేట్ సీతక్క రెండోసారి విజయం సాధించారు. మొత్తం 22 రౌండ్లలో లెక్కింపు జరుపగా మొదటి నుంచి సీతక్కే స్పష్టమైన మెజార్టీ సాధించింది.