బీసీలకు ఎక్కువ సీట్లు! లోక్ సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం

  •     కనీసం ఐదారు సీట్లు ఇచ్చేలా కసరత్తు  
  •     బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోకున్నా టికెట్
  •     ఎస్సీ రిజర్వ్​డ్​లో రెండు మాదిగలకు, ఒకటి మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్లు
  •     ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ మీటింగ్​లో చర్చ 
  •     కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ డ్రామాలను తిప్పికొట్టాలని నేతలకు సీఎం రేవంత్ పిలుపు 
  •     బీఆర్ఎస్​కు కౌంటర్​గా నల్గొండలో భారీ సభ పెట్టే యోచన

హైదరాబాద్, వెలుగు: రానున్న లోక్​సభ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. కనీసం ఐదారు సీట్లను కేటాయించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్​ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అప్లికేషన్ల ప్రక్రియ ముగియగా, 17 సెగ్మెంట్లకు గాను 309 అప్లికేషన్లు వచ్చాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం గాంధీభవన్​లో ప్రదేశ్​ఎలక్షన్ కమిటీ (పీఈసీ) సమావేశం నిర్వహించారు. సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ స్క్రీనింగ్ ​కమిటీ చైర్మన్​ హరీశ్​ చౌదరి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్​ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక టి నుంచి మూడు పేర్లను సిఫార్సు చేయాలని పీఈసీకి ఏఐసీసీ స్క్రీనింగ్​కమిటీ సూచించినట్టు తెలిసింది. సామాజిక, గెలుపు సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు టిక్​ కొట్టాలని, బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోగా షార్ట్ లిస్టును దీపాదాస్ ​మున్షీకి అందజేయాలని ఆదేశించినట్టు సమాచారం. 

బీసీలకు న్యాయం చేయాలన్న రేవంత్.. 

టికెట్ల విషయంలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో సీఎం రేవంత్ చెప్పినట్టుగా తెలుస్తున్నది. బీసీల ప్రయోజనాల కోసమే కులగణన చేపడుతున్నామని పేర్కొన్న రేవంత్.. లోక్​సభ సెగ్మెంట్లలో గెలిచే స్థానాలను వాళ్లకు ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. కనీసం ఐదారు స్థానాలను కేటాయించాలని చర్చించినట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలప్పుడే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని అనుకున్నప్పటికీ.. కొన్ని సమీకరణాల వల్ల కుదరలేదని, లోక్​సభ ఎన్నికల్లో వారికి న్యాయం చేయాలని రేవంత్ చెప్పినట్టు సమాచారం.

ఇక ఎస్సీ రిజర్వ్ డ్ సెగ్మెంట్లలో రెండు సీట్లు మాదిగలకు, ఒక సీటు మాల సామాజికవర్గానికి కేటాయించాలని డిమాండ్లు వచ్చినట్టు సమాచారం. మరోవైపు యూత్ కాంగ్రెస్​లీడర్లకూ అవకాశం కల్పించాలని ఆ విభాగం నుంచి డిమాండ్ ​వ్యక్తమైనట్టు తెలుస్తున్నది. కాగా, అభ్యర్థుల లిస్టులో నియోజకవర్గాల వారీగా ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయన్న లెక్కలను పొందుపరిచినట్టు తెలుస్తున్నది. అయితే బీసీ ఓట్లను అదర్స్ కేటగిరీలో పెట్టినట్టు తెలిసింది. దీనిపై బీసీ లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అదర్స్​ కేటగిరీని బీసీ ఓట్ల కేటగిరీగా మార్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

బలమైన నేతలుంటే డైరెక్ట్ టికెట్..  

అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే నేతలు ఎవరైనా అప్లై చేసుకోకున్నా.. సదరు లీడర్లు వారి నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే స్థాయిలో ఉంటే టికెట్లు ఇచ్చే విషయంపై ఆలోచిస్తామని హరీశ్​చౌదరి, సీఎం రేవంత్ చెప్పినట్టు తెలిసింది. వారి నియోజకవర్గాల్లో ఆయా నేతలకు ఉన్న బలం, బలగం, ఓట్లు, గెలుపు సమీకరణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అలాంటి లీడర్లకు టికెట్లు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. త్వరలోనే పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్తున్న నేతలు.. వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి సోనియాను బరిలోకి దింపాలని భావిస్తున్న నేతలు.. ఆమె పోటీ చేసే స్థానంపైనా చర్చించినట్టుగా తెలుస్తున్నది.

ఆమె ఖమ్మం నుంచి బరిలోకి దిగుతారని అంటున్నప్పటికీ.. జహీరాబాద్, నల్గొండ స్థానాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కొందరు సూచించినట్టుగా తెలుస్తున్నది. సమావేశంలో ఎమ్మెల్సీలు మహేశ్​కుమార్​ గౌడ్, బల్మూరి వెంకట్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కీ, ఏఐసీసీ సెక్రటరీ సంపత్​ కుమార్, యూత్​ కాంగ్రెస్​ స్టేట్​ ప్రెసిడెంట్​శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్ఎస్​కు కౌంటర్​గా ప్రియాంక సభ.. 

ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై పీఈసీ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్​తప్పులన్నీ చేసేసి రివర్స్​లో కాంగ్రెస్​పైనే ఎగురుతున్నదని.. ఆ పార్టీకి గట్టి కౌంటర్లు ఇవ్వాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు సమాచారం. కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ డ్రామాలను తిప్పికొట్టాలని చెప్పినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు కౌంటర్​గా పార్టీ ఆధ్వర్యంలోనూ సభ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

నల్గొండలో సభను నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. 2 లక్షల మందితో భారీ సభ నిర్వహిద్దామని ఆయన సూచించగా.. అందరూ ఆమోదం తెలిపినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని.. ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఆమెకు వీలు కుదిరే తేదీన సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సభలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్​సిలిండర్​పథకాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. 

ALSO READ: సీఎం రేవంత్ ప్రజల నాయకుడు: మందుల సామేలు

సోషల్​ ఈక్వేషన్స్​చూస్తున్నం: ఉత్తమ్

అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలనూ చూస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పీఈసీ మీటింగ్ అనంతరం బయటకు వస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. షార్ట్​లిస్ట్​ చేసిన అభ్యర్థుల జాబితాను సెంట్రల్​ఎలక్షన్​ కమిటీకి పంపుతామని, ఆ తర్వాతి ప్రక్రియను స్క్రీనింగ్​కమిటీ చేపడుతుందని ఆయన చెప్పారు.