
సూర్యాపేట, వెలుగు : శాసనసభ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి స్పీకర్ ను అవమానించేలా మాట్లాడడం తగదన్నారు.
Also Read : మీ హిందీని మా మీద రుద్దకండి..పవన్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
సభను పక్కదారి పట్టించేలా వ్యవహరించిన జగదీశ్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన చట్టసభల్లో జగదీశ్‌రెడ్డి ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. మొదటి నుంచి బీఆర్ఎస్ దళితులను అవమానిస్తూనే ఉందని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా, మాజీ కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, వల్దాస్ దేవేందర్, జ్యోతికరుణాకర్, నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, ముదిరెడ్డి రమణారెడ్డి, దొంతి రెడ్డి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.