
న్యూఢిల్లీ: భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక ప్రక్రియను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఈసీ సెలక్షన్ కమిటీ నుంచి సీజేఐను తప్పించడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు సీఈసీ ఎంపికను వాయిదా వేయాలని కాంగ్రెస్ కోరింది. అహాన్ని ప్రదర్శించకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలని పేర్కొంది. కాగా, ప్రస్తుత భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పదవి కాలం రేపటితో (ఫిబ్రవరి 18) ముగియనుంది.
ఈ నేపథ్యంలో తదుపరి సీఈసీ ఎంపికకు కేంద్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం (ఫిబ్రవరి 17) భేటీ అయ్యింది. ఈ సమావేశానికి హాజరైన సెలక్షన్ ప్యానెల్ మెంబర్ రాహుల్ గాంధీ.. సీఈసీ ఎంపికను వాయిదా వేయాలని కోరారు. సీఈసీ ఎంపికకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు సీఈసీ ఎంపిక ప్రక్రియను వాయిదా వేయాలన్నారు.
అసలు వివాదమేంటంటే..?
భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తోంది. ఈ కమిటీలో ప్రధానితో పాటు సీజేఐ, లోక్ సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. సీఈసీ తర్వాత ఎన్నికల సంఘంలో సీనియర్ అయిన వ్యక్తిని నెక్ట్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎంపిక చేయడం అనవాయితీగా వస్తోంది. అయితే.. సీఈసీ ఎంపిక విధానాన్ని 2023లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. సీఈసీని ఎంపిక చేసే సెలక్షన్ ప్యానెల్ నుంచి సీజేఐను తొలగించింది. సీజేఐకి బదులుగా ప్రధాని సూచించిన కేంద్ర మంత్రి ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. గతంలో సీనియర్ అధికారిని సీఈసీగా నియమించినట్లుగా కాకుండా.. కొత్త చట్టం ప్రకారం.. సెలక్షన్ కమిటీ మెజార్టీ మేరకు సీఈసీని ఎంపిక చేస్తారు.
ALSO READ | కొత్త సీఈసీపై కేంద్రం కసరత్తు.. ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ కమిటీ భేటీ
ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సీఈసీ ఎంపికను తన నియంత్రణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని.. సీఈసీ ఎంపిక ప్యానెల్లో ఆధిక్యం కోసమే సీజేఐను తొలగించిదని కాంగ్రెస్ మండిపడుతోంది. సీఈసీ ఎంపికపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 19 లేదా 22న సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఈసీ ఎంపిక ప్రక్రియను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తీర్పు వచ్చాక సీఈసీని ఎంపిక చేయాలని పేర్కొంది.