- ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన
ముషీరాబాద్, వెలుగు: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంబేద్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మాల మహానాడు, దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ నాయకులు వీహెచ్, రోహిణి రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విగ్రహం ముందు బైఠాయించి, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అంబేద్కర్ విగ్రహం నుంచి నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు ముట్టడికి బయలుదేరగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించిన సునీతా రావు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారిని అరెస్టు చేయడానికి పోలీసులు రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే సమయంలో అతిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మాల మహానాడు నాయకులు పిల్లి సుధాకర్, బైరి రమేశ్ మాల సంఘాలతో కలిసి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
బీజేవైఎం ఆందోళన..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహనం కోల్పోయి తమ పార్టీ ఎంపీపై దాడి చేశారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ అన్నారు. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్న సమయంలోనే బీజేవైఎం నాయకులు అక్కడికి చేరుకొని అంబేద్కర్‌కు పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో దళిత, మాల మహానాడు సంఘాలు, కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బీజేవైఎం నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.