- నెహ్రూ తప్పులను ఇందిర, రాజీవ్ కొనసాగించారు
- సోనియా గాంధీ సూపర్ పీఎంగా వ్యవహరించారు
- కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనపై లోక్‌సభలో ప్రధాని మండిపాటు
న్యూఢిల్లీ: దేశంలో 55 ఏండ్లపాటు ఒకే కుటుంబం (నెహ్రూ–గాంధీ కుటుంబం) అధికారంలో ఉన్నదని, ఈ సమయంలో దేశానికి తీరని నష్టం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎమర్జెన్సీ అనేది చీకటి అధ్యాయమని, ఈ మచ్చను కాంగ్రెస్ ఎన్నటికీ చెరిపేసుకోలేదని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదన్నారు.
రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో కానిస్టిట్యూషన్పై నిర్వహించిన ప్రత్యేక చర్చ ముగింపు సందర్భంగా మోదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్య పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇవి దేశం గర్వపడే క్షణాలని అన్నారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. మహిళలకు రాజ్యాంగం ద్వారానే ఓటు హక్కు లభించిందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనమన్నారు. లోక్‌సభలో తాను రాజ్యాంగంపై మంచి చర్చ జరుగుతుందని అనుకున్నానని, కానీ.. కొందరు వారి లోపాలను బయటపెట్టుకోవాలని నిర్ణయించుకున్నారంటూ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు.
రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది..
స్వాతంత్ర్యానంతరం కొందరు స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డామని, బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారని మోదీ అన్నారు. ప్రజల్లో విషబీజాలు నాటుతూ వారు దేశ ఐక్యతను దెబ్బతీశారంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నించిందని మండిపడ్డారు. దేశాన్ని ఒకే కుటుంబం 55 ఏండ్లపాటు పాలించిందని అన్నారు.
స్వాతంత్ర్యం తర్వాత 1952 వరకు మనకు ఎన్నికైన ప్రభుత్వం లేదని, ఆ సమయంలో ఆ ఫ్యామిలీ చెప్పలేనంత నష్టం చేసిందన్నారు. 1951లో కాంగ్రెస్ భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి చేసిందని అన్నారు. దేశంలో నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారని పేర్కొన్నారు. దొంగచాటుగా రాజ్యాంగ సవరణలు చేశారని, రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారని, ఆయన తప్పుచేస్తున్నారని బాబూ రాజేంద్ర ప్రసాద్‌లాంటి పెద్దలు చెప్పినా నెహ్రూ వినలేదన్నారు.
కాంగ్రెస్ ది రక్తదాహం
కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లలో 75 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందని మోదీ తెలిపారు. ఆ పార్టీ రక్తం రుచి మరిగిందని, అందుకే రాజ్యాంగాన్ని మళ్లీ మళ్లీ వేటాడిందని ధ్వజమెత్తారు. నెహ్రూ చేసిన తప్పులనే ఇందిరాగాంధీ కొనసాగించారని అన్నారు. కుర్చీని కాపాడుకునేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను హరించారని మండిపడ్డారు. వేలాది మందిని జైళ్లకు తరలించారని, కోర్టుల నోరు మూయించడంతోపాటు పత్రికల గొంతునూ నొక్కేశారని అన్నారు.
సుప్రీంకోర్టు జడ్జిల పదోన్నతిని కూడా అడ్డుకున్నారన్నారు. రాజీవ్‌గాంధీ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని, వారి తర్వాతి తరం కూడా అదే పనిలో ఉన్నదంటూ సభలో ఉన్న రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీపై పరోక్షంగా విమర్శలు చేశారు. సోనియా గాంధీ సూపర్ పీఎంగా వ్యవహరించారని, కీలక నిర్ణయాలు తీసుకునేది పార్టీ అధ్యక్షురాలు అని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ స్వయంగా ప్రకటించారని చెప్పారు. ఇదే కాంగ్రెస్ పాలన తీరుకు నిదర్శనం అని విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత కూడా యూనిఫాం సివిల్ కోడ్ కావాలని అన్నారని, కానీ, కాంగ్రెస్ దానికి వ్యతిరేకమన్నారు. తాము మాత్రం 2014లో అధికారం చేపట్టినప్పటినుంచి రాజ్యాంగాన్ని బలోపేతం చేశామన్నారు.
అంబేద్కర్ కు కాంగ్రెస్ అన్యాయం: కిరణ్ రిజిజు
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ఆయనకు భారత రత్న ఇవ్వకుండా ఆలస్యం చేసిందని మండిపడ్డారు. చివరకు వీపీ సింగ్ ప్రభుత్వం అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిందన్నారు. నిజానికి భారత రత్నకు మొదటి అర్హుడు అంబేద్కర్ అని, కానీ ఆయనను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. ఇందుకుగాను ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక లోపాలను దాచిపెట్టి రాజ్యాంగ అంశాలను ఎంపిక చేసిందన్నారు. కాగా, రాహుల్ కామెంట్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. సావర్కర్ శత జయంతి సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రాసిన లెటర్ ను షేర్ చేసింది. సావర్కర్ ను భారతదేశ గొప్ప కుమారుడు అని ఇందిర కొనియాడినట్టు అందులో ఉంది.