- హస్తం పార్టీకి ఐదాఫీస్లు
- కేంద్ర మాజీ మంత్రి రేణుక పర్యటనలో బహిర్గతమైన కాంగ్రెస్ విభేదాలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెంలో రేణుక పర్యటనలో భాగంగా జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంటే ఖమ్మం జిల్లా నేతలు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి కొత్తగూడెంలో బుధవారం పర్యటించగా పొంగులేటి, భట్టి వర్గాలు దీనికి దూరంగా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లో ఇప్పటికే నాలుగు కాంగ్రెస్ ఆఫీసులుండగా ఇప్పుడు కొత్తగా పొంగులేటి ఆధ్వర్యంలో మరో ఆఫీసును ఏర్పాటు చేయడంతో గ్రూపు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.
హస్తం పార్టీకి ఐదు ఆఫీస్‌లు
జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గాను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలంలో పోటీ చేసిన కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేటలో టీడీపీ క్యాండెట్ గెలిచారు. అయిదు నియోజకవర్గాలకు ఐదింటిని కాంగ్రెస్, మిత్రపక్షాలు గెలుచుకొని బీఆర్ఎస్కు షాక్ ఇచ్చాయి. జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ ఫుల్‌గా ఉన్నా నాయకుల మధ్య విభేదాలు, గ్రూపు రాజకీయాలతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని కార్యకర్తలు వాపోతున్నారు.
జిల్లా కేంద్రంలో భాగమైన కొత్తగూడెం, చుంచుపల్లి ఎవరికి వారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లను ఏర్పాటు చేసుకున్నారు. కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో జిల్లా పార్టీ ఆఫీస్ ఉండగా రేణుక వర్గానికి చెందిన ఎడవల్లి కృష్ణ రైటర్ బస్తీలో ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత నాగ సీతారాములు చుంచుపల్లి మండలం విద్యానగర్‌లో జిల్లా పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు చుంచుపల్లి మండలంలో క్యాంప్ ఆఫీస్ పేర పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా చుంచుపల్లి మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఏ పార్టీ ఆఫీస్‌కు వెళితే ఎవరికి కోపం వస్తుందో అర్థం కాక కార్యకర్తలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు.
గ్రూపులు కట్టి.. అయోమయానికి గురి చేసి..
జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి రేణుక వర్గంతో పాటు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గ్రూపులున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరుతో కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు నడస్తున్నాయి. భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, పొంగులేటి గ్రూపులకు చెందిన నాయకులు, కార్యకర్తలు హడావుడి చేస్తున్నారు. కొత్తగూడెంలో టీపీసీసీ జనరల్‌సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య ర్యాలీ, సభల్లో రేణుకా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ ప్రోగ్రాంకు భట్టి, పొంగులేటి వర్గాలకు చెందిన నాయకులు అటెండ్ కాలేదు. మరో వైపు పది రోజుల కిందట పొంగులేటి చుంచుపల్లి మండలంలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేయగా భట్టి, రేణుక వర్గాలకు చెందిన నేతలు హాజరు కాలేదు. కొత్తగూడెం టికెట్ కోసం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ టికెట్‌కోసం ప్రయత్నిస్తున్నారు.
కాగా అన్ని గ్రూపులకు చెందిన నేతలను సమన్వయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య ఫెయిల్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లోనూ గ్రూపు రాజకీయాలకు కొదువ లేదు. అశ్వారావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డైరెక్ట్‌గా పొంగులేటిపై ఘాటు విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. పినపాక, ఇల్లెందు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నేతల మధ్య సరైన కో ఆర్డినేషన్ లేదు. దీంతో కార్యకర్తల్లో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.