
- ఎవరికి దక్కుతుందోనని జిల్లా నేతల్లో ఉత్కంఠ
- కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరాసక్తత
- రేస్‌లో డజన్‌కుపైగా లీడర్లు
- తెరపైకి బీసీ వాదం
నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి నువ్వా..నేనా అన్నట్లుగా పోటీ నడుస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన నేతలు, టికెట్ దక్కని వారితో సహా ముఖ్య లీడర్లు ఈ పోస్టును ఆశిస్తూ పైరవీలు చేస్తున్నారు. పలువురు లీడర్లు బీసీవాదాన్ని వినిపిస్తుండగా మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ నేతలు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తే రాజకీయంగా ఎదగవచ్చని నేతల అంచనా. డీసీసీ ప్రెసిడెంట్‌గా ఇప్పటి రెండు దఫాలు పనిచేసిన మానాల మోహన్‌రెడ్డి టర్మ్ ముగియడంతో డీసీసీ పీఠం దక్కించుకోవాలని ఎవరికి వారు పైరవీలు షురూ చేశారు.
పెరుగుతున్న పోటీదారుల లిస్ట్..
అసెంబ్లీ ఎలక్షన్లో రూరల్ టికెట్ ఆశించి భంగపడ్డ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్‌రెడ్డి డీసీసీ పోస్టు కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు తన దగ్గరి బంధువైన స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజును ఆశ్రయించారు. జిల్లా పార్టీలో సీనియర్ లీడరైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపైనా ఒత్తిడి చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన ఆర్మూర్ సెగ్మెంట్ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి డీసీసీ పోస్టుపై ఇంట్రెస్ట్‌తో ఉన్నారు.
అసెంబ్లీ ఎలక్షన్లో ఓటమిచెందినప్పటికీ యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. బాల్కొండ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి యూత్ కోటాలో పార్టీ అధ్యక్ష పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్ కూడా రేస్‌లో కొనసాగుతున్నారు.
నేను సైతం అంటున్న ఈరవత్రి, మరికొందరు..
రాష్ట్రంలో బీసీ గణన తరువాత బీసీ నినాదం బలం పుంజుకుంది. ఈ వర్గం నుంచి మాజీ విప్, స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనీల్ డీసీసీ పోస్టు కోసం హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో ఆర్మూర్ టికెట్ ఆశించిన బీసీ నేత ఏబీ శ్రీనివాస్ (చిన్నా), నుడా చైర్మన్ కేశ వేణు, మాజీ జడ్పీటీసీలు కంచెట్టి గంగాధర్, అమృతాపూర్ గంగాధర్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సన్నిహితుడు శేఖర్‌గౌడ్ డీసీసీ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. మరో బీసీ నేత నరాల రత్నాకర్ ఢిల్లీ లెవల్లో పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు.
ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్మైనార్టీ వర్గం నుంచి డీసీసీ పోస్ట్‌కు సై అంటున్నారు. పార్టీ ప్రచార కమిటీ మెంబర్ జావెద్ అక్రమ్ యూత్ కోటాలో ఈ పదవిని కోరుతున్నారు. ఎస్టీ వర్గం నుంచి మాజీ ఎంపీపీ యాదగిరి, మాజీ జడ్పీటీసీ మోహన్ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు లీక్‌లు వస్తున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ డీసీసీ ప్రెసిడెంట్ గడుగు గంగాధర్ మరోసారి ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఎమ్మెల్యేలు 'నో'
రాష్ట్రంలో డీసీసీ ప్రెసిడెంట్లుగా అక్కడి ఎమ్మెల్యేలను నియమిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ ప్రకటించారు. ఆయన ప్రతిపాదనపై జిల్లాలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి ఆసక్తి చూపడం లేదు. క్యాడర్‌ను సమన్వయం చేసుకునే సమర్థులను గుర్తించి అపాయింట్ చేయాలని టీపీసీసీకి సూచించారు. మూడేండ్ల డీసీసీ పోస్టును మానాల మోహన్‌రెడ్డి ఇప్పటికీ రెండు దఫాలు నిర్వహించారు.
ఫిబ్రవరిలో ముగిసిన టర్మ్‌ను మూడోసారి రిన్యూవల్ చేసుకోవడానికి ఆయన ఇంట్రెస్ట్‌గా లేరు. ఈ విషయాన్ని టీపీసీసీకి కూడా తెలిపారు. స్టేట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్న ఆయన ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే ఉంటూ వీలుదొరికినప్పుడు బాల్కొండ సెగ్మెంట్‌కు సమయం కేటాయిస్తున్నారు.