షాకింగ్ వీడియో.. పీకల దాకా తాగేసి కారు నడిపి బీభత్సం.. ముగ్గురిని చంపేశాడు..!

షాకింగ్ వీడియో.. పీకల దాకా తాగేసి కారు నడిపి బీభత్సం.. ముగ్గురిని చంపేశాడు..!

జైపూర్: రాజస్థాన్లోని జైపూర్ నగరంలో ఒక SUV బీభత్సం సృష్టించింది. SUV డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మద్యం మత్తులో అతి వేగంతో జనాల మీదకు దూసుకెళ్లాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు చనిపోయారు. గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. 500 మీటర్ల పరిధిలో ఉన్న వాహనాలను, ప్రజలను ఢీ కొట్టిన తర్వాత ఆ SUV ఆగిందని అడిషనల్ డీసీపీ భజ్ రంగ్ సింగ్ షెకావత్ తెలిపారు.

SUV అదుపు తప్పిన ఘటనలో మమతా కన్వర్ (50), వీరేంద్ర సింగ్ (48), మహేశ్ సోనీ (28), మహ్మద్ జలాలుద్దీన్ (44), దీపికా సైనీ (17), విజయ్ నారాయణ్ (65), జెబున్నిసా (50), అన్షికా (24), అవదేశ్ పరీక్ (37) తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. మమతా కన్వార్, అవదేశ్ పరీక్, వీరేంద్ర సింగ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి నిందితుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నహర్ గర్ రోడ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతని ఇంటిని బుల్డోజర్లతో కూల్చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ నిరసన తెలిపారు. 

పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో SUV వాహనాన్ని అతి వేగంగా డ్రైవ్ చేసి ఇంత మంది ప్రాణాలు తీసిన నిందితుడిని 62 ఏళ్ల ఉస్మాన్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. ఉస్మాన్ ఖాన్ జైపూర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అని తెలిసింది.