కేటీఆర్ సిరిసిల్ల టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారిపోయిండని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిరిసిల్లలో షాడో ఎమ్మెల్యేలుగా పదిమంది ఉన్నారని..ఈ షాడో ఎమ్మెల్యేల చుట్టే మొత్తం అవినీతి కేంద్రీకృతమైందని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గానికి పోలీసు బందోబస్తు లేకుండా కేటీఆర్ ఎందుకు రాలేకపోతున్నారని ప్రశ్నించారు. సిరిసిల్లలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించడానికి బండి సంజయ్ కి నోరు రావడం లేదని మండిపడ్డారు.
సిరిసిల్లలో గత సంవత్సరం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. నేతన్నలకు చనిపోయాక ఇచ్చే నేతన్న భీమా కంటే బతికున్నప్పుడు ఉపయోగపడే నేత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రాంతంలో ప్రశ్నించే గొంతుల అణిచివేతపై వివరాలు తీసుకొని మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేస్తామన్నారు. అభివృద్ధి పనులను కాకుండా కేవలం మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని బండి సంజయ్ ను ప్రశ్నించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోడీ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నారన్నారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సానుభూతి రాజకీయాలకు చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ తన నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, దేవాలయాల చుట్టూ తిరుగుతుండడం విడ్డూరమన్నారు.