దేశ స్వాతంత్య్రంలో కాంగ్రెస్ పాత్ర, మహనీయుల ప్రస్తావన లేకుండా ప్రధాని 75 ఏళ్ల వేడుకలు నిర్వహిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆయన పాదయాత్ర చేపట్టారు. గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి నుంచి ప్రారంభమైన ఆయన పాదయాత్ర..కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 10రోజుల పాటు కొనసాగనుంది.
ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షంలో సైతం భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు పొన్నం ధన్యవాదాలు తెలిపారు. తొలి ప్రధానిగా నెహ్రూ ఆలోచనలతో దేశం సుభిక్షంగా ఉందన్నారు. పారిశ్రామిక విప్లవం, వ్యవసాయ విప్లవం..పంచ వర్శ ప్రణాళికల ద్వార దేశ నిర్మాణం కోసం నెహ్రూ ఎంతో కృషి చేశారన్నారు.
కాంగ్రెస్ పేదవాడికి అన్నం పెట్టే పార్టీ - జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పేదవాడికి అన్నం పెట్టే పార్టీ అని..అన్ని వర్గాలను ఆదరిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. దేశ నిర్మాణంలో కాంగ్రెస్ ఎనలేని కృషి చేసిందన్నారు. ఎందరో మహానుభావులు త్యాగం చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు తెలిపారు. దేశానికి ఆయువుపట్టు అయిన గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. నాగార్జున్ సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సహా ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.