కాంగ్రెస్ .. రైతుల ప్రభుత్వం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

కాంగ్రెస్ .. రైతుల ప్రభుత్వం :  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు :  కాంగ్రెస్.. రైతుల ప్రభుత్వం అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండలం బొగ్గపూర్ డీఎంఆర్ ఫంక్షన్ హాల్ బుధవారం జరిగిన  కోటిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్ఆర్ హయంలో  రైతులకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. కొత్తగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు,వ్యాపారులకు వారధిగా పనిచేస్తూ ఎవరూ నష్టపోకుండా చూడాలని, మార్కెట్ యార్డ్ ను  కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.  అనంతరం కోటిపల్లికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తాండూరు ఎమ్మల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కొత్త వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, జడ్పీటీసీలు సంతోష, ధారాసింగ్, ఎంపీపీలు శ్రీనివాస్ రెడ్డి, అనురాధ, పీఏసీఎస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.