- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ
హాలియా, వెలుగు : గిరిజన, ఆదివాసీల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ చెప్పారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ విహార్‌లో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీలు, గిరిజనులు రాజకీయంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజంలో సరైన గుర్తింపు వస్తుందన్నారు. వారిలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చే లక్ష్యంతో రానున్న రెండేండ్లలో దేశంలో పదివేల సెంటర్లలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ సర్కార్ చేపట్టిన కులగణన దేశవ్యాప్తంగా రోల్ మోడల్‌గా మారిందన్నారు. ఆదివాసీలకు విద్య, ఉద్యోగం ఉపాధి, వైద్య అవకాశాలు మెరుగుపడేలా చూడాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ అనే నినాదానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలంటే.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముందుగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళి అర్పించారు. శిక్షణ తరగతుల్లో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, బాలూనాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, సీఎల్పీ మాజీ లీడర్ కుందూరు జానారెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నాయకులు కొప్పుల రాజు పాల్గొన్నారు.