సుమన్​ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్

  •     శవయాత్ర చేసి దిష్టిబొమ్మలు దహనం
  •     చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

నెట్​వర్క్, ఆదిలాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డిపై చెన్నూర్​మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్​ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లాలోని పలుచోట్ల సుమన్​దిష్టిబొమ్మలతో శవయాత్ర చేసి దహనం చేశారు. సుమన్​పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చెన్నూర్​లో సుమన్​ ఫొటోకు చెప్పుల దండ వేసి ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​ నుంచి కొత్త బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. బస్టాండ్ ఆవరణలో దిష్టిబొమ్మ దహనం చేశారు. నాయకులు హేమంత్​ రెడ్డి, మహేశ్ తివారి, రఘునందన్ రెడ్డి, రవి, నాగరాజు, చిన్న సూర్యనారాయణ, అన్వర్, వంశీ, కవిత తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ పూర్ లో సుమన్ దిష్టి బొమ్మను దహనం చేశారు.

దండేపల్లిలో సుమన్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. జైపూర్ మండలం  టేకుమట్లలో కాంగ్రెస్ లీడర్లు గోనె నర్సయ్య, ప్రశాంత్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సుమన్​పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నాయకులు పెంట రజిత, గజ్జల హేమలత, నజీర్, సురేందర్, వెంకటసాయి, జగన్, శ్రీనివాస్​ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.