- మున్సిపల్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం
- బీఆర్ఎస్కు బిగ్‌షాక్
నారాయణఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గత మున్సిపల్ ఎన్నికల తర్వాత బలం లేకున్నా బల్దియాలో పాగావేసిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకుంది. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ రుబీనా బేగంనజీబ్, వైస్ చైర్మన్ అహర్ పరశురాంపై కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
దీంతో ఖేడ్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరినట్లయింది. శుక్రవారం ఖేడ్ మున్సిపల్ అధికారులు అవిశ్వాసంపై చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా, అందులో బీఆర్ఎస్ నుంచిఏడుగురు, కాంగ్రెస్ నుంచి 8 మంది కౌన్సిలర్లు గెలిచారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీ ఓట్లతో చైర్మన్ స్థానాన్ని దక్కించున్నారు.
కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ కు చెందిన 11 మంది కౌన్సిలర్లు చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.
ఓటింగ్ ఇలా జరిగింది..
అవిశ్వాస ఓటింగ్ కోసం ఆర్డీవో వెంకటేశం సమక్షంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి మున్సిపల్ ఆఫీసులో సమావేశం ఏర్పాటుచేయగా, ముందుగా కాంగ్రెస్ కౌన్సిలర్లు 11 మంది హాజరయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కౌన్సిలర్ల కోసం వెయిట్ చేసి టైం అయ్యాక కోరంను పరిగణలోకి తీసుకుని ఆర్డీవో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
చైర్ పర్సన్ నజియా బేగంకు వ్యతిరేకంగా 11 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తోపాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులుగా మొత్తం 13 సంఖ్య బలం చూపించారు. అవిశ్వాస తీర్మానానికి 12 మంది అవసరం ఉండగా, 13 మంది సభ్యులు హాజరై తమ బలం నిరూపించుకున్నారు. దాంతో చైర్ పర్సన్ పై కాంగ్రెస్ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగినట్టు ఆర్డీవో వెంకటేశం ప్రకటించారు.
చైర్మన్ గా ఆనంద్ స్వరూప్ శెట్కార్
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఆ పార్టీ నుంచి చైర్మన్ గా ఆనంద్ స్వరూప్ శెట్కార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆశీస్సులు ఆనంద్ కు ఉండడంతో దాదాపు ఆయనే చైర్మన్ గా ఖరారు అయినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే వైస్ చైర్మన్ గా దారం శంకర్ ను ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.