కేంద్ర మంత్రిగా బండి సంజయ్​ ఏం చేస్తున్నడు: దర్పల్లి రాజశేఖర్​రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆలయాలు, మసీదులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్​ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ కార్పొరేటర్  దర్పల్లి రాజశేఖర్ రెడ్డి చెప్పారు.

శనివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటున్న బండి సంజయ్, కేంద్ర మంత్రి హోదాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. మందిరాలు, మసీదులపై దాడులు జరగకుండా చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. యూపీలో దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.