
మెదక్, వెలుగు : రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మడంపైనే కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెడుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ రకంగా అప్పు చేయొచ్చు ? ఏ భూమి అమ్మొచ్చు ? అనే సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని, కాంగ్రెస్ వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను రాహుల్‌గాంధీకి తాకట్టు పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్లు, వ్యాపారులు, కంపెనీలను బెదిరిస్తూ, అక్రమ కేసులుపెడుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదని, కొత్త స్కూల్ బిల్డింగ్‌లు నిర్మించలేదని, గ్రామాల్లో రైతులకు సహకారం అందడం లేదన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
పదేండ్లలో బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిందన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో ఎక్కడా కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరగలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లను గెలిపించాలని కోరారు. సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, ఎమ్మెల్సీ ఎన్నికల మెదక్ జిల్లా ఇన్‌చార్జి మురళీగౌడ్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల అధ్యక్షులు గోదావరి, రాధా మల్లేశ్‌గౌడ్, టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కొమురయ్య పాల్గొన్నారు.
తెలంగాణ సమస్యలపై బీజేపీ పోరాటం
తెలంగాణలో నెలకొన్న సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం మెదక్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, కౌలు రైతులకు రూ.12 వేలు, దళితులకు రూ.12 లక్షల సాయం చేస్తామని చెప్పారని, ఆ హామీలు ఎటు పోయాయని ప్రశ్నించారు. ఎంతో ఆశతో గెలిపించిన ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. మంత్రులు, కాంగ్రెస్ లీడర్ల మధ్య సమన్వయం లేదన్నారు.