భువనగిరి ఖిలా మళ్లీ చేతికి చిక్కేనా?

  • మూడు ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ 
  • ఓట్ల చీలికతో ఒక్కసారి ఓటమి 

యాదాద్రి, వెలుగు : భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గంలో   కోమటిరెడ్డి బ్రదర్స్​ పోటీలో లేకపోవడంతో ఈసారి కాంగ్రెస్​ గెలుస్తుందా  అనే చర్చ మొదలైంది.  ఈ నియోజకవర్గంలో మూడుసార్లు ఎన్నికలు జరగగా.. రెండుసార్లు కాంగ్రెస్​ గెలిచింది. ఒకసారి బీఆర్​ఎస్​ గెలిచింది.  ఎలాగైనా భువనగిరిలో కాంగ్రెస్​ తన సత్తా చాటాలని భావిస్తోంది.  గతంలో మూడుమార్లు కోమటిరెడ్డి కుటుంబీకులే పోటీలో ఉండటంతో  ఆ పార్టీ క్యాడర్​ పట్టుదలగా పని చేసింది. కానీ,  ఈసారి నియోజకవర్గంలో పూర్తి స్తాయిలో పరిచయం లేని  చామల కిరణ్​కుమార్​ రెడ్డిని హైకమాండ్​ పోటీకి దింపింది. ఈ మార్పు కాంగ్రెస్​ శ్రేణుల్లో  మొదట నిరాశ కలిగించింది. కానీ,  గెలుపు బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి అప్పజెప్పడంతో    ఊపిరి పీల్చుకున్నారు. 

రెండుమార్లు గెలుపు

ఉమ్మడి నల్లగొండలో మిర్యాలగూడ లోక్​సభ స్థానానికి బదులుగా నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భువనగిరి లోక్​సభ ఏర్పడింది. దీని పరిధిలో  రంగారెడ్డి, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, జనగామ జిల్లాల్లోని ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్​, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు  ఉన్నాయి.  2009లో జరిగిన మొదటి   ఎన్నికల్లో కాంగ్రెస్​  నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి గెలిచారు. 2014 ఎన్నికల్లో రాజగోపాల్​రెడ్డి నిలిచినా బీఆర్​ఎస్​ నుంచి బూర నర్సయ్య గౌడ్​   గెలుపొందారు. 2019 ఎన్నికల్లో    మళ్లీ కాంగ్రెస్​ నుంచి కోమటిరెడ్డి వెంకట రెడ్డి  విజయం సాధించారు.  

బీజేపీ  ఓట్లు చీల్చడంతో ఒకసారి ఓటమి

2009 లో  కాంగ్రెస్​ నుంచి  రాజగోపాల్​  రెడ్డి, బీజేపీ నుంచి  చింత సాంబమూర్తి  పోటీలో ఉండగా..  టీడీపీ, సీపీఎం, సీపీఐ కలిసి మహాకూటమిగా ఏర్పడి సీపీఎంకు చెందిన నోముల నర్సింహయ్యను బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కేవలం 45,805 ఓట్లు రాగా, మహాకూటమి అభ్యర్థికి 3,63,143 వచ్చినా  రాజగోపాల్​రెడ్డి 5,02,605 ఓట్లతో గెలుపొందారు.  

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి.  ఉమ్మడి అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డికి 1.82 లక్షల ఓట్లు, కాంగ్రెస్​ అభ్యర్థి రాజగోపాల్​ రెడ్డికి గతం కంటే 84 వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. బీజేపీ ఎక్కువగా ఓట్లు చీల్చడంతో బూర నర్సయ్య గౌడ్​ (బీఆర్​ఎస్​) 4,46,903 ఓట్లు వచ్చినా గెలిచారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీవీ  శ్యాంసుందర్​రావు ప్రభావం చూపకపోవడంతో 65,222 ఓట్లు మాత్రమే వచ్చాయి. బూర నర్సయ్య గౌడ్​ (బీఆర్​ఎస్​) 5,27,235 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీల్లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5,32,031 ఓట్లు సాధించి గెలిచారు. 

కోమటిరెడ్డి లేకుండా ఫస్ట్​ ఎన్నిక

జిల్లా ఏర్పడక ముందు నుంచి భువనగిరి​పై కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పట్టుంది. లోక్​సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులు రెండుసార్లు ఎంపీగా గెలవడం, మధ్యలో రాజగోపాల్​రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడంతో పట్టు మరింత పెరిగింది. కాంగ్రెస్​లో కోమటిరెడ్డి సోదరుల కోసం పని చేసేవారు  ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వెంకటరెడ్డి తన మార్క్​ చూపించుకున్నారు. 2009లో భువనగిరి లోక్​సభ స్థానం ఏర్పడినప్పటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులే –బరిలో నిలిచి, రెండుమార్లు గెలవడంతో ఈసారి కూడా ఆ కుటుంబం నుంచే అభ్యర్థి ఉంటారని అందరూ అనుకున్నారు. 

అయితే అందరి అంచనాలకు భిన్నంగా సీఎం రేవంత్​రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న చామల కిరణ్​కుమార్​రెడ్డిని పార్టీ ​  ఎంపిక చేసింది.   భువనగిరి లోక్​సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు కాంగ్రెస్​ చేతిలోనే ఉన్నాయి.  చామల గెలుపు బాధ్యతను కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డికి సీఎం  అప్పగించారు. దీంతో అప్పటివరకూ నిరాశతో ఉన్న కాంగ్రెస్​ కేడర్​కు ఉత్సాహం వచ్చింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తక్కువగా ఓట్లు రావడంతో భువనగిరి ఈసారి  చేతికి చిక్కుతుందని కాంగ్రెస్​ కేడర్​ ధీమాతో ఉంది.