- నేడు చైర్మన్ పదవికి ఎన్నిక
- యునానిమస్ చేసేందుకు ప్రయత్నాలు
- రెండు రోజుల కింద డైరెక్టర్లతో హైదరాబాద్‌లో మంతనాలు
- తెరపైకి మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి పేరు
మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగనుండగా, ఏకగ్రీవం చేయాలని పావులు కదుపుతోంది. అత్యధిక మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నా.. తాము నిర్ణయించిన క్యాండిడేట్‌కు మద్దతు తెలిపేలా మంతనాలు జరుపుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
చైర్మన్ రాజీనామాతో..
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ) మహబూబ్‌నగర్ పరిధిలో పాలమూరుతో పాటు నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో 77 ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్) ఉండగా 15 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరిలో డీసీసీబీ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్‌గా మక్తల్‌కు చెందిన నిజాంపాషాను ఎన్నుకున్నారు. అయితే, గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశాడు.
దీంతో చైర్మన్ ఎన్నికను ఈ నెల 23న నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం శుక్రవారం ఎన్నిక జరగనుంది. 15 మంది డైరెక్టర్లు ఓటింగ్‌లో పాల్గొనున్నారు. స్థానిక డీసీసీబీ ఆఫీసులోనే ఎన్నిక నిర్వహించనుండగా.. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చైర్మన్ స్థానానికి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. 11 గంటల నుంచి 11.30 గంటల వరకు నామినేషన్ల పరిశీలన
12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 2:30కు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు.
హైదరాబాద్‌లో మంతనాలు..
డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నం చేస్తోంది. 15 మంది డైరెక్టర్లలో బీఆర్ఎస్కు 12 మంది సంఖ్యా బలం ఉండగా, కాంగ్రెస్ కు రెండు, బీజేపీకి ఒకరు ఉన్నారు. 8 మంది మద్దతు ఎవరికి ఉంటే వారే చైర్మన్‌గా గెలుపొందుతారు. అయితే అధికార పార్టీ ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పాన్‌గల్ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగా, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు.
అదే పార్టీ నుంచి డైరెక్టర్‌గా గెలుపొందారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచి మామిళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేసిన మల్లు రవికి మద్దతు పలికారు. ఆ తర్వాత పార్టీ నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారకున్నా.. హస్తం పార్టీకి పని చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మామిళ్లపల్లికి సపోర్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఆయనను చైర్మన్ చేసి పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ లీడర్ బంధువు ఫంక్షన్‌కు మహబూబ్‌నగర్, మేకగూడ, ఆమనగల్లు, గోరిట, కోస్గి, నారాయణపేట, కొత్తకోట, షాద్‌నగర్, పుటాన్‌దొడ్డి, ఉప్పునుంతల, వెంకటాయపల్లి, కోడూరు, ఆయోధ్యనగర్ డైరెక్టర్లను పిలిపించారు. అక్కడే మామిళ్లపల్లి వారితో మంతనాలు జరిపి, తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ మేరకు ఒక్కో డైరెక్టర్‌కు పెద్ద మొత్తంలో నజరానాలు కూడా ప్రకటించినట్లు సమాచారం.
బరిలో ఇద్దరు ఉండే అవకాశం..
డీసీసీబీ చైర్మన్ పోస్టు ఉమ్మడి జిల్లా స్థాయి పదవి కావడం.. ప్రొటోకాల్ కూడా ఉండడంతో ఈ స్థానంపై పోటీ చేసేందుకు మరికొందరు సిద్ధం అవుతున్నారు. మహబూబ్‌నగర్ డైరెక్టర్ కోరమోని వెంకటయ్య బరిలో ఉంటారనే టాక్ నడిచినా.. ఇటీవల ఆయన చైర్మన్ పదవి చేయి దాటిపోయిందని తన సన్నిహిత వర్గాలతో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే అనూహ్యంగా షాద్‌నగర్ నియోజకవర్గంలోని మేకగూడ బీఆర్ఎస్ డైరెక్టర్
కె.మంజులా రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఆమె చైర్మన్ పోటీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అత్యధిక డైరెక్టర్లు బీఆర్ఎస్ కే ఉండడంతో తమకే మద్దతు ఉంటుందనే నమ్మకంతో పోటీకి సై అంటున్నట్లు తెలిసింది. దీంతో పోటీ మామిళ్లపల్లి, మంజులారెడ్డి మధ్య ఉండే అవకాశం ఉంది.