
- మెదక్ ఎంపీ స్థానం కోసం కసరత్తు
- అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శేణుల్లో నూతనోత్తేజం
- పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్లాన్
సిద్దిపేట, వెలుగు : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ల పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఈ మూడు సెగ్మెంట్లలో అధిక ఓట్లు సాధించేందుకు పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సెగ్మెంట్ల లో కాంగ్రెస్ అభ్యర్థులకు మొత్తం 80 వేల ఓట్లు మాత్రమే రావడం వల్ల పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ స్థానాలున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ మినహా ఆరు స్థానాల్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు పడ్డా మిగిలిన మూడు చోట్ల నామమాత్రంగానే ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు వచ్చేలా ప్లాన్ వేస్తున్నారు. ఈ మూడు సెగ్మంట్ల లో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఉన్నా సరైన నాయకత్వం లేకపోవడమే ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణంగా గుర్తించారు.
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఆరు సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి 40 వేల మెజార్టీ సాధించినా సిద్దిపేట లో వచ్చిన ఓట్లతో ఫలితం తారుమారై ఎంపీగా విజయశాంతి గెలవడాన్ని గుర్తు చేస్తూ.. ఈసారి ఆ పరిస్థితి పురావృతం కాకుండా చూడాలని భావిస్తున్నారు.
టార్గెట్ రెండు లక్షల ఓట్లు
సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు రెండు లక్షల పై చిలుకు ఓట్లు పొందాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు ముందుకు సాగుతున్నారు. గత ఏడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలను కలుపుకుని కాంగ్రెస్ అభ్యర్థులకు 80,905 ఓట్లు పొలైతే బీఆర్ఎస్ అభ్యర్థులకు 3,14,755 ఓట్లు పొలైనాయి.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పొలైన ఓట్ల తో పాటు అదనంగా మరో రెండు లక్షల ఓట్లు సాధించాలనే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మూడు సెగ్మంట్ల బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే మైనంపల్లి హన్మంతరావు మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశం వుందనే ప్రచారం సాగుతోంది.