- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన కొనసాగిస్తోందని, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా నాయకులు కృషి చేయాలన్నారు. సోమవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం సోమలగడ్డ క్రాస్ రోడ్డులోని పీఎస్సార్ గార్డెన్స్ లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో చురుకుగా పని చేయాలని సూచించారు.
బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 53వేల ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఊరూరా జెండా పండుగ నిర్వహించాలని, నాలుగు పథకాలను ప్రభుత్వం ప్రారంభించనున్నదని చెప్పారు. కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, ములుగు జిల్లా, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.