కర్నూలులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్న నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నూల్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా బీచుపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. నీరజా రెడ్డి వెళ్తున్న ఫార్చునర్ కారు వెనక టైర్ పేలడంతో అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది.
దాంతో కారు నుజ్జు నుజ్జైంది. ప్రమాదంలో నీరజా రెడ్డి తల, శరీర భాగాలకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో కర్నూలు లోని ప్రభుత్వ ఆసుపత్రికి నీరజను పోలీసులు తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. గాయాలు తీవ్రమవడంతో నీరజ చికిత్స పొందుతూ మరణించింది.
2009లో ఆలూరు నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన నీరజ.. ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో నీయోజక వర్గంలో అవినీతి జరుగుతుందని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న నీరజ.. 2019లో వైఎస్సార్ సీపీలో చేరారు. తర్వాత ఆ పార్టీ వీడి బీజేపీలో చేరారు.
1996లో పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేసిన నీరజ భర్త పాటిల్ శేసిరెడ్డి.. ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురయ్యారు. ప్రస్తుతం నీరజా రెడ్డి మరణంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తనది ముమ్మాటికీ హత్యే అని కొందరు అంటున్నారు.