హైదరాబాద్: నవంబర్ 1న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. రాహుల్ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో రాహుల్ యాత్రకు సంబంధించిన వివరాలను అంజన్ కుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు. నవంబర్ ఒకటో తేదీ ఉదయం శంషాబాద్ నుంచి ఆరంగర్ వరకు రాహుల్ పాదయాత్ర ఉంటుందన్నారు. సాయంత్రం 4 గంటలకు చార్మినార్ కు చేరుకుంటారని, అక్కడ రాజీవ్ సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారని చెప్పారు. తర్వాత పాత బస్తీ మీదుగా గాంధీ భవన్ కు చేరుకుంటారని చెప్పారు. అక్కడి నుంచి అసెంబ్లీ, సెక్రటేరియట్ మీదుగా నెక్ లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు రాహుల్ పాదయాత్ర చేరుకుంటుందని స్పష్టం చేశారు.
అక్కడ రాహల్ సభ జరగునుందని తెలిపారు. అక్కడి నుంచి బోయినిపల్లికి చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారని అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అలాగే నవంబర్ 2వ తేదీన బాలానగర్ చౌరస్తా నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా నగరం దాటి వెళ్తారని ఆయన చెప్పారు. ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి రాహుల్ యాత్రను విజయవంతం చేయాలని అంజన్ కుమార్ యాదవ్ కోరారు.