గరీబీ హఠావో అన్నరు కానీ..  పేదలను దోచుకున్నరు : ప్రధాని నరేంద్ర మోదీ

గరీబీ హఠావో అన్నరు కానీ..  పేదలను దోచుకున్నరు : ప్రధాని నరేంద్ర మోదీ
  • కాంగ్రెస్​కు పేదలు అభివృద్ధిలోకి రావడం ఇష్టముండదు: మోదీ

ముంబై/న్యూఢిల్లీ:  కాంగ్రెస్​ పార్టీ ‘గరీబీ హఠావో’ అనే నినాదమిస్తూ.. పేదలను దోచుకున్నదని  ప్రధాని మోదీ విమర్శించారు. పేదలు అభివృద్ధిలోకి రావడం ఆ పార్టీకి ఇష్టం ఉండదని పేర్కొన్నారు.  గురువారం మహారాష్ట్రలోని పన్వేల్​లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని, ప్రసంగించారు.  ‘‘ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్​ ముందుంది. పేదలకు ఆ పార్టీ ప్రధాన శత్రువు. పేదలు ఎప్పుడూ పేదరికంలో ఉండాలనే ఏకైక ఎజెండాతో కాంగ్రెస్​ పనిచేస్తుంది.” అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు దాటిపోయినా ఇంకా దేశంలోని చాలా మంది ప్రజలు తిండి, బట్టలు, నివాసం కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్​ను అడ్డుకునే పెద్ద బాధ్యత పేదలపైనే ఉన్నదని చెప్పారు.  

పదేండ్లలో పేదల పరిస్థితి మారింది

దేశంలో పదేండ్లలో పేదల పరిస్థితి మారిందని ప్రధాని మోదీ అన్నారు. తమ సర్కారు 25 కోట్ల మందిని పేదరికంనుంచి బయటకు తీసుకొచ్చిందని చెప్పారు. జార్ఖండ్​లో ఇండియా కూటమికి చెందిన ఓ నేత అక్రమ వలసదారులకు కూడా గ్యాస్​ సిలిండర్​ సబ్సిడీ అందజేస్తామని అంటున్నారని, చొరబాటుదారులకు మేలు చేసేవారిని ఆదరిద్దామా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం సమాజాన్ని చీల్చేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నదని, దేశ భవిష్యత్తును ప్రమాదంలో నెడుతున్నదని ఆరోపించారు. అందరూ కలిసికట్టుగా ఉన్నామని వారికి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు చత్రపతి శివాజీ మహరాజ్​ స్ఫూర్తితో సుపరిపాలన అందిస్తామని తెలిపారు.  

నేడు బోడోల్యాండ్​ మహోత్సవ్​ ప్రారంభం

ఢిల్లీలోని ఎస్​ఏఐ ఇందిరాగాంధీ స్పోర్ట్స్​ కాంప్లెక్స్​లో మొదటి బోడోలాండ్​ మహోత్సవ్​ను శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభిస్తారని పీఎం కార్యాలయం తెలిపింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగిస్తారని వెల్లడించింది. రెండు రోజులపాటు ఈ మహోత్సవ్​ కొనసాగుతుందని తెలిపింది. బోడోలాండ్​లోనే కాకుండా అస్సాం, పశ్చిమ బెంగాల్​, నేపాల్, నార్త్​ఈస్ట్​ ఇంటర్నేషనల్​ బోర్డర్​లో ఉన్న బోడో ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా ఈ మహోత్సవ్​ ను నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.  

మోదీకి డొమినికా అత్యున్నత అవార్డు

ప్రధాని నరేంద్ర మోదీకి డొమినికా తమ దేశ అత్యున్నత అవార్డును ప్రకటించింది. కరోనా సమయంలో డొమినికాకు ఇండియా అందించిన సహకారానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ  కృషి చేశారని వెల్లడించింది. వచ్చేవారం గయానాలో జరిగే ఇండియా-కరికోమ్ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ‘‘2021 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ డొమినికాకు 70 వేల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపించారు. దాంతో మేం కరోనా నుంచి బయటపడగలిగాం. మోదీ చొరవ వల్లే హెల్త్, ఎడ్యుకేషన్, ఐటీ రంగాల్లో ఇండియా మాకు మద్దతిస్తున్నది. మా అభివృద్ధిలో ఇండియా కీలకంగా ఉంది. అందుకే ఆ దేశ ప్రధానిని మా అత్యున్నత పురస్కారంతో గౌరవించాలని భావించాం” అని డొమినికా పీఎం ఆఫీస్​పేర్కొంది.