
లడఖ్ విషయంలో అగ్రిమెంట్‌పై సందేహాలున్నయ్: జైరాం రమేశ్
న్యూఢిల్లీ: లడఖ్‌లో చైనా ఆక్రమణల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి దాసోహం అయ్యారని, డ్రాగన్ కుయుక్తులకు ఆయన మోసపోయారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఆరోపించారు. తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గస్తీని పునరుద్ధరించేందుకు వీలుగా ఇండియా, చైనా మధ్య ఒప్పందం కుదరడంపై ఆయన స్పందిస్తూ.. సరిహద్దులో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఈ ఒప్పందంపై పలు సందేహాలు వస్తున్నాయని అన్నారు. ఎల్ఏసీ వెంబడి 2020 మార్చికి ముందు ఉన్న యథాతథ స్థితి కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
కేంద్రానికి ఆరు ప్రశ్నలు..
చైనాతో ఒప్పందం విషయంలో కేంద్రం ఆరు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని జైరాం డిమాండ్ చేశారు. ‘‘గతంలో మాదిరిగా దేస్పాంగ్ నుంచి ఫైవ్ పెట్రోలింగ్ పాయింట్ల వరకూ మన బలగాలు మళ్లీ గస్తీ కాస్తాయా? నాలుగేండ్లుగా ఖాళీ చేసిన దేమ్చోక్ ప్రాంతంలోకి మళ్లీ మన బలగాలు చేరుకుంటాయా? పాంగాంగ్ సో వద్ద మన బలగాలు గతంలో ఫింగర్ 8 వరకూ వెళ్లగలిగేవి.
ఇప్పుడు ఫింగర్ 3 పాయింట్ వరకే పరిమితమవుతాయా? గతంలో మాదిరిగా గోగ్రా హాట్ స్ప్రింగ్స్ లోని మూడు పెట్రోలింగ్ పాయింట్లకు వెళ్లేందుకు మన బలగాలకు అనుమతి ఉంటుందా? హెల్మెట్ టాప్, ముక్పా రే, టేబుల్ టాప్, ఇతర ప్రాంతాల్లో భారత పశువుల కాపరులు మళ్లీ పశువులను మేపుకోవచ్చా? పరమ వీర చక్ర మేజర్ షైతాన్ సింగ్ స్మారకం ఉన్న రెజాంగ్ లా ప్రాంతాన్ని బఫర్ జోన్ గా అంగీకరించినందున, అది ఇక మనకు గతమేనా? సమాధానాలు చెప్పాలి” అని ఆయన ప్రశ్నించారు.