వయనాడ్: విపత్తును కూడా బీజేపీ రాజకీయం చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి వేలాది మంది మృతి చెందిన ఘటనను ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ లోక్ సభ స్థానంలో యూడీఎఫ్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా సుల్తాన్ బతేరి అసెంబ్లీ నియోజకవర్గంలో కెనిచిరలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆమె ప్రసంగించారు. ‘‘ప్రజలకు తీరని బాధను మిగిల్చిన విపత్తును కూడా బీజేపీ రాజకీయం చేసింది.
ఆ పార్టీ రాజకీయాలు ద్వేషం, విభజనతో కూడుకున్నవి. దేశవ్యాప్తంగా అవి విస్తరిస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కాషాయపార్టీ పట్టించుకోవడం లేదు. వాటిని ఇంకా పరిష్కరించలేదు. ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అవి అదుపులో ఉండే సూచనలు కనిపించడం లేదు. నిరుద్యోగిత అత్యధిక స్థాయిలో ఉంది. ఈ సమస్యల నుంచి మీ దృష్టి మరల్చడమే బీజేపీ లక్ష్యం. ఎట్టిపరిస్థితుల్లోను అధికారంలో కొనసాగాలన్నదే ఆ పార్టీ ఉద్దేశం. నన్ను పార్లమెంటుకు పంపించండి. మీ కోసం నేను కష్టపడతాను. మీ సమస్యలను ప్రతిచోటా వినిపిస్తాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తాను. మీ అందరి తరఫున బలంగా నిల్చొని పోరాడుతాను” అని చెప్పారు.