వారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తున్నది : నరేంద్ర మోడీ

కాంగ్రెస్ అంటే.. తప్పుడు హామీలకు, అవినీతికి, బంధుప్రీతికి గ్యారెంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ వారంటీ  ముగిసిందని, వాళ్ల హామీలకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌‌ మీట్‌‌లో ప్రధాని మోడీ కాంగ్రెస్ అంటే అవినీతి, బంధుప్రీతి, తప్పుడు హామీలుఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నయ్ ప్రజల ఆశీర్వాదం కోసం కర్నాటకలో పర్యటిస్తనని వెల్లడించారు. 

న్యూఢిల్లీ/బెంగళూరు: కాంగ్రెస్ అంటే.. తప్పుడు హామీలకు, అవినీతికి, బంధుప్రీతికి గ్యారెంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు.‘‘కాంగ్రెస్ నిజమైన హామీలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది. ఆ పార్టీ వారంటీ గడువు ముగిసింది. అలాంటప్పుడు కాంగ్రెస్ హామీలకు అర్థం ఏముంటుంది?” అని ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌‌లలో ఆ పార్టీ ఉచితాల సంస్కృతిలో నిమగ్నమైందని ఆయన ఆరోపించారు. వారి ఎన్నికల హామీలు ఇప్పటికీ హామీలుగానే ఉన్నాయని అన్నారు. గురువారం కర్నాటకలోని లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌‌గా ప్రధాని మాట్లాడారు. ‘‘గత 9 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు కేంద్రంగా ఇండియా మారింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల.. కర్నాటక సర్కారు భారీ ప్రయోజనాలు పొందింది” అని ఆయన వివరించారు.   

బీజేపీ కార్యకర్తలా పని చేస్త

‘‘ఓ బీజేపీ కార్యకర్తలా రానున్న రోజుల్లో మీతో కలిసి పని చేస్తా. ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కర్నాటకలో పర్యటిస్తా. కన్నడిగుల నమ్మకాన్ని గెలుచుకుంటా. ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోందని ప్రచారంలో ఉన్న బీజేపీ నాయకులు చెప్పారు. ఇది బీజేపీ విషయంలో జనం నమ్మకాన్ని తెలియజేస్తోంది” అని మోడీ వివరించారు. ‘‘బీజేపీ షార్ట్ కట్స్‌‌ తీసుకోవడం లేదు. మోడర్న్ ఫిజికల్, డిజిటల్, సోషల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ లలో గణనీయమైన పెట్టుబడులతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కృషి చేస్తోంది. ఎఫ్‌‌డీఐ (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్) అంటే.. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’. బీజేపీ ఐదేళ్ల సొంత పాలన గురించి ఆలోచించదు. మేం పార్టీ గురించి ఆలోచించబోం.. కానీ దేశం గురించి ఆలోచిస్తాం. మేం ఎన్నికల రాజకీయాల గురించి మాత్రమే ఆలోచించడం లేదు.. వచ్చే ఎన్నికల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి ఆలోచిస్తున్నాం” అని అన్నారు.  

ఉచితాలతో ప్రభుత్వాలను నడపలేం

ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, దేశాన్ని, ప్రభుత్వాలను ఇలా నడపలేమని ప్రధాని చెప్పారు. ‘‘కొన్ని తాత్కాలిక సవాళ్లను పరిష్కరించడానికి.. ఉచిత రేషన్, టీకాలు  అందిస్తున్నాం. అయితే దేశాన్ని అభివృద్ధి చేయాలంటే.. ఈ ఉచితాల సంస్కృతిని వదిలించుకోవాలి’’ అని తెలిపారు. ‘‘కొన్ని పార్టీలు ఉచితాలతో మిమ్మల్ని ఫూల్స్ చేయవచ్చు. కానీ మీ భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం మీ కర్తవ్యం” అని యువతకు సూచించారు. 

రికార్డులు బద్దలైతయ్

‘‘ దేశంలో కొన్ని పార్టీలు రాజకీయాలను అధికారానికి, అవినీతికి సాధనాలుగా చేసుకున్నాయి. ఇందుకోసం సామ దాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్నాయి. ఈ పార్టీలు దేశ, కర్నాటక భవిష్యత్తు, యువత, మహిళల గురించి ఆలోచించడం లేదు” అని మోడీ అన్నారు. ‘ఉచిత’ పథకాల పేరుతో రాష్ట్రాలు పక్షపాత రాజకీయాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయని, ఇది భవిష్యత్ తరాలకు నష్టాన్ని మిగులుస్తోందని చెప్పారు. వేగవంతమైన అభివృద్ధికి.. పూర్తి మెజారిటీతో కూడిన బలమైన, స్థిరమైన బీజేపీ ప్రభుత్వం ముఖ్యమని, అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రధాని అన్నారు.