- ఏడు అసెంబ్లీ సీట్లూ హస్తగతం
- ఇక పార్లమెంటు సీటూ తమదేనంటున్న నేతలు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి లోక్ సభ స్థానం పరిధిలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కింది. కాకా వెంకటస్వామి కంచుకోట అయిన ఈ స్థానంలో పదేళ్ల తర్వాత మళ్లీ హస్తం పార్టీ పాగా వేసింది. తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి పెద్దపల్లి లోక్ సభతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
మాజీ కేంద్ర మంత్రి కాకా కంచుకోటగా భావించే పెద్దపల్లిలో కాంగ్రెస్ తిరిగి క్లీన్ స్వీప్ చేయడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై విసుగెత్తిన జనం
అటు వెంకటస్వామి, ఇటు వివేక్ వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వివేక్ వెంకటస్వామి చురుగ్గా పాల్గొన్నారు. ఆయన పదవీ కాలమంతా ఉద్యమంలోనే గడిచిపోయింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పటికీ.. తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆయన ఒత్తిడి చేశారు.
కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంలో గడ్డం వెంకటస్వామి, వివేక్ చేసిన కృషి అందరికీ తెలిసిందే. 2014లో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడానికి సోనియాగాంధీని ఒప్పించడంలో వెంకటస్వామిదే కీలక పాత్ర. ఇక కాకా ఫ్యామిలీ హయాంలోనే పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ది జరిగింది తప్ప గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమీలేదు.
దీనికి తోడు ఇక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, ఇసుక దందాలు, ఇతరత్రా అవినీతి, అక్రమాల ఆరోపణలు భారీగా వచ్చాయి. సింగరేణిలో రెగ్యులర్ ఉద్యోగాలు క్రమేణా తగ్గిపోవడం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోకపోవడం, ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలను అమ్ముకోవడం వంటి అనేక అంశాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓటమికి కారణంగా నిలిచాయి.
నాలుగుసార్లు ఎంపీగా కాకా
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని మొదటి నుంచీ కాకా కంచుకోటగా చెప్తారు. 1962 నుంచి 2014 వరకు రెండుసార్లు మినహా పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగింది. 1984, 1998 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ ఇక్కడ గెలిచింది. మాజీ కేంద్ర మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి ఎక్కువ కాలం పాటు ఈ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన పెద్దపల్లి నుంచి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో వెంకటస్వామి కుమారుడు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై 2014 వరకు కొనసాగారు.