- రాష్ట్ర బడ్జెట్ లో రూ.3065 కోట్లు కేటాయింపు
- అప్పుల పాలైన బల్దియాకు ఊరట
- గత పాలకుల తీరుతోనే నష్టాలు
హైదరాబాద్, వెలుగు : రూ. వేల కోట్ల అప్పుల ఊబిలో చిక్కిన బల్దియాకు ఊరట లభించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేసింది. గత పదేండ్లలో బల్దియాను పట్టించుకోకపోగా.. ప్రతి ప్రాజెక్టుకు అప్పులు తెచ్చిపెట్టింది. తీవ్ర అప్పుల్లో కూరుకుపోగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఊహించని విధంగా రూ.3,065 కోట్లను కేటాయించింది. బల్దియా భవిష్యత్ కు భరోసా ఇచ్చింది. మొదటినుంచి సీఎం రేవంత్ రెడ్డి సిటీ అభివృద్ధిపై తమదైన ముద్ర ఉంటుందని చెబుతుండగా.. అనుకున్నట్టుగానే నిధులు కేటాయించారు.
కేటాయింపులు పరిశీలిస్తే.. సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ (హెచ్ సిటీ) కోసం రూ.2,654 కోట్లు, కోటి జనాభా దాటిన సిటీలకు 15వ ఫైనాన్ కమిషన్ గ్రాంట్స్ కింద రూ.411 కోట్లను కేటాయించింది. మున్సిపాలిటీ అసిస్టెన్స్ స్టేట్ షేర్ కు సంబంధించి మరో రూ.700 కోట్లు, ట్యాక్స్ కంపెన్సేషన్ కింద రూ.10 కోట్ల చొప్పున కేటాయింపులు చేసింది. అయితే హెచ్ సిటీకి రూ.2,500 కోట్లు, క్యాపిటల్ వర్క్స్ కు రూ.2500 కోట్లు, మిగతా వాటికి మరో రూ.1,000 కోట్లు కావాలని, మొత్తంగా రూ.6 వేల కోట్లు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కోరింది.
ఎన్ని నిధులు అడిగినా నో రెస్పాన్స్
గత పదేండ్లలో ఎన్ని నిధులు అడిగినా కూడా అప్ప టి సర్కార్ నుంచి ఎలాంటి స్పందన వచ్చేది కాదు. ప్రస్తుత ప్రభుత్వం కేటాయించిన నిధులపై సిటీ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ బయట కొన్ని ప్రాంతాలు, స్థానిక సంస్థలను కలుపుతూ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ను ఏర్పాటు చేసి.. దానికి రూ. 200 కోట్లు కేటాయించింది. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్ మెంట్(కుడా) బోర్డుకు రూ.13 కోట్లను పెట్టింది. ఇచ్చే నిధులతో ఎస్ఆర్డీపీ ఫేజ్-–2, ఎస్ఎన్టీపీ ఫేజ్-–2 లతో పాటు సీఆర్ఎంపీ కింద ఇప్పటికే పనులను కొనసాగిస్తుండగా.. ఏజెన్సీలతో పాటు కొత్తగా మరిన్ని రోడ్లను ఇచ్చేందుకు నిధులను వినియోగిస్తామని అధికారులు తెలిపారు.
మేయర్ విజయలక్ష్మి హర్షం
ప్రభుత్వం బడ్జెట్ లో సిటీకి భారీగా నిధులు కేటాయించడంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ధన్యవాదా లు తెలిపారు. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హెచ్ఎండీఏ, మెట్రో, మూసీ క్లీనింగ్ వంటి వాటికి రూ.10 వేల కోట్లు వెచ్చిస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీకి కేటాయించి న నిధులతో సిటీ పూర్తి స్థాయి లో అభివృద్ధి చెంది అంతర్జాతీయ గుర్తిం పు పొందుతుందని ఆమె పేర్కొన్నారు.
గత పదేండ్లలో కేటాయింపులు..ఇచ్చిన నిధులు ఇలా
ఏడాది కేటాయింపులు విడుదల చేసిన నిధులు
( రూ.కోట్లలో) (రూ. కోట్లలో)
2014-15 375.93 288.14
2015-16 428 23
2016-17 70.30 1.32
2017-18 67.28 -
2018-19 - -
2019-20 - -
2020-21 10 17
2021-22 - -
2022-23 - -
2023-24 87.83 -