- రూ. 500 కు సిలిండర్ స్కీమ్ కు లబ్ధిదారుల ఎంపికకు
- హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 41 లక్షల గ్యాస్ కనెక్షన్లు
- రేషన్‌కార్డు ఉన్న వారికి పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారుల ఎంపికకు సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల్లో ప్రకటించిన విధంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ ను అందించే స్కీమ్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేయాలనే దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించలేదు.
కానీ ఈ స్కీమ్ తప్పనిసరిగా రేషన్‌కార్డు ప్రాతిపదికగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు అంటున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని రేషన్ కార్డులు ఎన్ని? రూ. 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలంటే ఏం చేయాలనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనేది తెలుసుకోవడంతో పాటు రూ. 500 కే సిలిండర్ ను ఇస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనేది విషయంపైనా అధికారులు అంచనాలు వేస్తున్నారు.
ఈ లెక్కలు తేలిన తర్వాతనే రూ. 500 కు సిలిండర్ లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలోని 9 సర్కిళ్లతో పాటు, మిగిలిన రెండు జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు ఆయిల్ కంపెనీలతో కలిసి లెక్కలు తీస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ఇచ్చే సమాచారం ఆధారంగానే పౌరసరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అంటున్నారు.
15 లక్షల మందికే స్కీమ్..
గ్రేటర్‌పరిధిలోని ఆయా జిల్లాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం అధికారులు రూ.500 రూపాయలకు గ్యాస్‌సిలిండర్ లబ్ధిదారులను దాదాపు గుర్తించినట్టు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి మొత్తం 41లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రేషన్‌కార్డులు ఉన్నవారు మాత్రం 17.25 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వీరిలో 15 లక్షల మందికే గ్యాస్కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రేషన్‌కార్డు ఉన్నవారికి పథకం వర్తించాలంటే కేవలం15 లక్షల మందే 500లకు గ్యాస్కనెక్షన్లకు అర్హులవుతారు. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాలను బట్టి మళ్లీ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంటుందంటున్నారు. గ్యాస్ కనెక్షన్లు ఉండి రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఏంటన్న విషయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. రేషన్ కార్డులకు ప్రజాపాలనతో దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను బట్టి కొత్త కార్డులు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
Also read : అప్ గ్రేడ్ చేశారు.. ఎక్విప్మెంట్ మరిచారు!.. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో సమస్యలెన్నో
రేషన్‌కార్డులు వచ్చాక వారు 500 లకే గ్యాస్సిలిండర్పథకానికి దరఖాస్తు చేసుకుంటే వర్తిస్తుందని అంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం ప్రకటించిన 500 గ్యాస్ సిలిండర్ పథకంపై చాలా మంది వినియోగదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాలను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.