- అవకతవకలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపిస్తం
- మూడు బ్యారేజీలు దెబ్బతిన్నయని కామెంట్
- అవసరం లేని 3వ టీఎంసీ పనులను కేసీఆర్
- తన బంధువులకు కట్టబెట్టిండు: వెంకట్‌రెడ్డి
- భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో
- ఒక్క ఎకరాకూ నీళ్లియ్యలే: శ్రీధర్‌బాబు
- క్వాలిటీ లేకే బ్యారేజీలు కుంగినయ్: పొంగులేటి
- బాంబులంటూ తప్పుదోవ పట్టించారు: పొన్నం
- మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పరిశీలన
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. గత సర్కారు అవినీతి వల్లే కాళేశ్వరం ఇలా తయారైందని మండిపడ్డారు. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పారు. ప్రాణహిత -– చేవెళ్ల ప్రాజెక్టును రీ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. కుంగిన మేడిగడ్డ, బుంగలు పడ్డ అన్నారం బ్యారేజీలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబట్‌పల్లి గ్రామంలోని ఎల్‌అండ్‌టీ కంపెనీ ఆఫీస్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంత్రుల పర్యటన కొనసాగింది.
ఒక్కో ఎకరానికి నీళ్లిచ్చేందుకు రూ.కోటి ఖర్చు
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఇప్పటివరకు రూ.95 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 97 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. అంటే ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చేందుకు కోటి రూపాయల చొప్పున ఖర్చు చేసిన గత సర్కారు పనితీరు ఎలాఉందో ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు. ‘‘గతంలో కాంగ్రెస్ హయాంలో రూ.38 వేల కోట్లతో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ప్లాన్ చేశాం. దీనిపై రూ.11 వేల కోట్లు సైతం ఖర్చు చేశాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు ఆ ప్లాన్ మొత్తం మార్చేసి, ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చి, వేల కోట్లతో మూడు బ్యారేజీలు నిర్మించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. అద్భుతమని అన్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ అక్టోబర్ 21న పెద్ద శబ్దంతో భూమిలోకి కుంగింది. బ్లాక్ 7లో పిల్లర్లు 5 ఫీట్ల లోపలికి దిగబడ్డాయి. డిసెంబర్ 3 వరకు సీఎంగా కేసీఆర్ ఉన్నా.. మేడిగడ్డ కుంగుబాటుపై మాట్లాడలేదు. ఎక్కడా రివ్యూ చేయలేదు. కనీసం స్టేట్ మెంట్ ఇవ్వలేదు” అని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7న ఏర్పడిన వెంటనే దీనిపై విచారణ మొదలుపెట్టామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ రూ.80 వేల కోట్లకు ఆమోదిస్తే.. లక్షన్నర కోట్ల వరకు ఎస్టిమేషన్ పెరిగిందని అన్నారు. ‘‘మేడిగడ్డ ఒక్కటే కాదు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా నష్టం వాటిల్లింది. వీటిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక వాస్తవమే. బ్యారేజీలలో 1, 2 టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ ఉంచకూడదు. కానీ 8 టీఎంసీలకు పైగా నిల్వ చేశారు. గత సర్కారు అవినీతి వల్లే కాళేశ్వరం ఇలా తయారైంది. ఎన్నికల టైంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపడుతాం. గత ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించడంలో విఫలమైంది. ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించే దిశగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అలాగే ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును రీ స్టార్ట్ చేస్తాం” అని ఉత్తమ్ వెల్లడించారు.
వేల ఎకరాలు మునుగుతున్నా పట్టించుకోలే: శ్రీధర్‌బాబు
‘‘కాళేశ్వరం ప్రాజెక్టును భూపాలపల్లి జిల్లాలోని నా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మహాదేవ్‌పూర్ మండలంలో కట్టిన్రు. ఇక్కడి రైతుల భూములు తీసుకొని.. మూడు బ్యారేజీలు, రెండు పంప్‌హౌస్‌లు నిర్మించినా.. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్క ఎకరాకు కూడా సాగు నీళ్లియ్యలే’’ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తన నియోజకవర్గంతోపాటు చెన్నూరు నియోజకవర్గంలో వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నా గత సర్కారు ఒక్క ఎకరానికి కూడా నష్టపరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట జరిగిన అవినీతిని ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. తమకు ఆఫీసర్లపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, రాష్ట్ర సంపద సక్రమంగా వినియోగించాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు. గోదావరి జలాలతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలని, ముంపు కారణంగా నష్టపోతున్న మంథని ప్రాంతాన్ని ఆదుకోవాల్సి ఉందని అన్నారు.
క్వాలిటీ ఉంటే బ్యారేజీలెందుకు దెబ్బతిన్నయ్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
‘‘కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లలో చూపించిన ఆసక్తిని పనుల నాణ్యతలో చూపించలేదు. అందుకే కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు నీట మునిగాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు దెబ్బతిన్నాయి” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ‘‘2022 ఏప్రిల్ 28న మేడిగడ్డ బ్యారేజీలో సమస్య ఉందని ఇరిగేషన్ ఈఈ లేఖ రాశారు. వెంటనే సర్కారు ఎందుకు రిపేర్లు చేపట్టలేదు. ఒకవేళ మరమ్మతులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. రిపేర్లు చేస్తే తమకు పర్సనల్‌గా ఎలాంటి లాభం ఉండదనే సర్కారు పెద్దలు పట్టించుకోలేదు” అని పొంగులేటి ఆరోపించారు. ఇది ఒకటో, రెండో పిల్లర్లతో ఆగదని, రాఫ్ట్ కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయినప్పుడల్లా పిల్లర్లు భూమిలోకి కుంగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో వరదలు వచ్చినపుడు కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర కట్టిన స్టాప్ లాక్ గేట్లు ఎందుకు పనిచేయలేదని, పని చేయకపోతే అందుకు సంబంధించిన ఆఫీసర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘‘మేడిగడ్డ నుంచి ఫస్ట్ 50 టీఎంసీ నీరు లిఫ్ట్ చేశారు. మూడో బ్యారేజ్ వద్ద 41 టీఎంసీ లు లిఫ్ట్ చేశారు, మిగతా 9 టీఎంసీల నీరు ఎక్కడ వాడారు. ఇంత కరెంట్ ఖర్చు చేసి లిఫ్ట్ చేసిన నీరు మళ్లీ గోదారిలో వదిలేశారా? మరి మూడో టీఎంసీ నీటి వినియోగానికి ఎందుకు నామినేషన్ పద్ధతిలో పనులు మొదలు పెట్టారు. టన్నెల్‌ను కాదని ఆగమేఘాల మీద పైపు లైన్ వేశారు.. ఈ అంశాలన్నింటిపైనా తగిన చర్యలు చేపట్టాలి’’ అని చెప్పారు.
50 వేల కోట్ల అవినీతి: జీవన్ రెడ్డి
‘‘పేరు, పెద్దరికం కోసం గత ప్రభుత్వ పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే సర్కారు ఇంజనీర్లు ఎందుకు అడ్డుకోలేకపోయారు? కేసీఆర్ ఏం చదివిండని ఆయనకు అడ్డుచెప్పలేదు. మీరు చెప్పింది ఆయన వినకపోతే లీవ్ పెట్టుకొని వెళ్లిపోవాల్సింది” అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ‘‘ఈ ప్రాజెక్ట్ కింద మా భూములు కోల్పోయినం. మా బతుకుదెరువు పోయింది. అయినా ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతున్నది. ఇప్పుడెవరిని అడగాలి? దీనికి సర్కారు ఇంజనీర్లే బాధ్యత వహించాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా ఉన్న మీరు (ఈఎన్సీ మురళీధర్) ప్రభుత్వానికి తప్పుల గురించి వివరిస్తే బాగుండు. వాళ్లు వినకపోతే లీవ్ పెట్టుకొని పోతే ఇంత ప్రజాధనం దుర్వినియోగం కాకపోయేది” అని అన్నారు.
10 టీఎంసీల నీళ్లుండగా బాంబులు పెట్టిన్రా: పొన్నం
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వానికి మానస పుత్రిక. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగినప్పుడు పెద్ద శబ్దం వస్తే బాంబులు పెట్టి పేల్చి ఉంటారని ఇంజనీర్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పటి రాష్ట్ర సర్కారు పెద్దల ఒత్తిడి మేరకే ఇలా ఫిర్యాదు చేశారు. బ్యారేజీలో 10 టీఎంసీల నీళ్లుండగా బాంబులు పెట్టేంత శక్తి పాకిస్తాన్ తీవ్రవాదులకు కూడా లేదు. అలాంటిది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అలా కంప్లైంట్ చేశారు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపు వల్ల వేలాది ఎకరాల్లో పంటలు భూములు మునుగుతున్నా అప్పటి సర్కారు నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదేదో గొప్ప ప్రాజెక్టు అని అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, తీరా బ్యారేజీలు కుంగిపోతున్నాయని ఎద్దేవా చేశారు.
నీళ్లు పైకి తెచ్చి కిందికి వదలడం.. తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి దగ్గరే కట్టి ఉంటే ఎత్తిపోతలు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చేవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అక్కడే కట్టి ఉంటే ప్రాజెక్టు 8 ఏండ్ల కిందే పూర్తయ్యేదని, వికారాబాద్, చేవెళ్ల వరకు గ్రావిటీ ద్వారా సాగు నీరు వచ్చేదని చెప్పారు. ‘‘ప్రాణహితకు రూ.38 వేలకోట్లు ఖర్చవుతుందని నాడు అంచనా వేశారు. ఎస్టిమేషన్స్ పెరిగినా మరో 20 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. అప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉండాల్సింది. కాళేశ్వరం అద్భుత కట్టడమని అంతకు ముందు భారీగా ప్రచారం చేసుకున్నారు. అక్టోబర్ 21న మేడిగడ్డ కుంగిపోవడంతో ప్రజలకు అనుమానాలు వచ్చాయి. గ్రావిటీ ద్వారా కిందికి వెళ్లాల్సిన నీటిని.. మూడు బ్యారేజీలు కట్టి పైకి తెచ్చి మళ్లీ కిందికి వదిలిపెట్టడం తుగ్లక్ చర్య” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేని 3వ టీఎంసీ పనులను కేసీఆర్ తన బంధువులకు కట్టబెట్టారని, ఆ డబ్బు వృథా అని అసెంబ్లీలోనే చెప్పానన్నారు.
దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేసి, ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు అని కాళేశ్వరం గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీలు దొరికిన ప్రతిసారి గొప్పగా చెప్పుకుంది. ఇంజనీరింగ్ మార్వెల్ అని ప్రచారం చేసుకుంది. కానీ, కరెంటు బిల్లుల భారం తప్ప.. దాని వల్ల ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదని మంత్రుల తాజా పర్యటనలో బయటపడింది. ఒక్క వరదకే పంప్‌హౌస్ మునిగిపోవడం.. ఐదేండ్లకే ప్రధాన బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, ఇంకో బ్యారేజీకి బుంగలు పడటం.. కాళేశ్వరం పరిస్థితిని తెలియ జేస్తున్నదని మంత్రులు అన్నారు. ‘‘ఇది గత సర్కారు చేపట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్టు. అవినీతి తప్ప నాణ్యత లేని నాసిరకం ప్రాజెక్టు’’ అని మండిపడ్డారు.