
కోడేరు, వెలుగు: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో రూ. 3.20 కోట్ల తో బీటీ రోడ్డు శంకుస్థాపన రూ. 2.95 కోట్లతో కొత్త యాపట్ల గ్రామంలో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ, జగన్నాథపురం గ్రామంలో ఆంజనేయస్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబండతండాలో ప్రజా ప్రభుత్వంలో మంజూరైన గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం సాతాపూర్ గ్రామంలో గ్రామ రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు మంజూరు చేశారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ... ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దండు నరసింహ, వెన్నచర్ల శంకర్, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటేడ్ స్కూల్
అచ్చంపేట, వెలుగు: రూ. 11 వేల కోట్ల నిధులతో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్ని నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 25 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో నిర్మించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి మల్లేశ్ పాల్గొన్నారు.
కొల్లాపూర్: కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణ నదిలో స్పీడ్ బోట్లను మంత్రి జూపల్లి ప్రారంభించారు. కృష్ణా నదిలో స్పీడ్ బోటు నడిపారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి కలవరల నరసింహ, అధికారులు, మాజీ ఎంపీపీ గోవింద్ గౌడ్, పెంట్లవెల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.