సీఎంఆర్ఎఫ్​లో కొత్త రికార్డు .. ఏడాదిలోనే రూ.840 కోట్లు విడుదల

సీఎంఆర్ఎఫ్​లో కొత్త రికార్డు .. ఏడాదిలోనే రూ.840 కోట్లు విడుదల
  • 1.66 లక్షల కుటుంబాలకు లబ్ధి
  • దళారుల ప్రమేయం లేకుండా ఆన్​లైన్ లోనే దరఖాస్తులు
  • ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుసుకునేలా ఏర్పాట్లు
  • నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు

హైదరాబాద్, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.830 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.66 లక్షల మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. 2018 నుంచి 2023 వరకు అయిదేండ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద రూ.2,400 కోట్లు సాయం అందించింది. 

అంటే సగటున ఏడాదికి కేవలం రూ.480 కోట్లు రిలీజ్ చేసింది. కానీ.. కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే రూ.830 కోట్ల సాయం చేసింది. వీటిలో రూ.590 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించింది. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని ట్రీట్​మెంట్లు, ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం అవసరమైతే.. ప్రజా ప్రతినిధుల సిఫార్సు మేరకు సర్కార్ సాయం అందిస్తున్నది. కొన్ని వ్యాధులకు జిల్లా స్థాయిలో అవసరమైన వైద్య చికిత్స అందుబాటులో లేకపోతే.. హైదరాబాద్​లోని పెద్ద ఆస్పత్రులను ఆశ్రయిస్తారు. దీనికి ముందే బాధితులు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. నిమ్స్, ఎంఎన్​జే క్యాన్సర్ హాస్పిటల్, నిలోఫర్, ఈఎన్టీ, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్​కు అయ్యే అంచనా ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.

13వేల మందికి ఎల్వోసీలు

సీఎం సహాయ నిధి నుంచి సంబంధిత హాస్పిటల్​కు ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీ అవుతది. ఈ ఏడాదిలో 13వేల మందికి ఎల్​వోసీలు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. సుమారు రూ.240 కోట్లు విలువ చేసే ఎల్వోసీలు మంజూరు చేశారు. వీటిలో ఎక్కువగా చిన్న పిల్లలకు అవసరమయ్యే ఆపరేషన్లు, ట్రీట్​మెంట్లే ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఎల్​వోసీ ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఆదివారం కూడా సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. పుట్టుకతోనే ఈఎన్టీ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఆరేండ్ల లోపలే ఆపరేషన్లు చేయించాల్సి ఉంటది.

 దీని కోసం లక్షలు ఖర్చు అవుతాయి. పేద కుటుంబాలు డబ్బుల్లేక ఆపరేషన్లు చేయించుకోలేకపోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తదని, పిల్లలకు మాత్రం ట్రీట్​మెంట్లు అందించాలని ఇటీవల ఆదేశించారు. ఈ ఏడాది సుమారు 87 మంది పిల్లలకు ఎల్వోసీలు జారీ చేశారు. 

గతంలో ఫేక్​ బిల్లులతో నిధులు స్వాహా

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ విషయంలో అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. పేదల పేరుతో ఫేక్ మెడికల్ బిల్లులు సృష్టించి నిధులు దోచుకున్నట్లు తేల్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిధులు పక్కదారిపట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దళారుల ప్రమేయం లేకుండా ఆన్​లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నది.

 సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేలా వ్యవస్థను రూపొందించింది. గతంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో పని చేసిన సిబ్బంది.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. ఇలాంటివి జరగకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్ధిదారులతో పాటు వారి బ్యాంక్ ఖాతా నంబర్​ను ప్రభుత్వం ముద్రిస్తున్నది. అదేవిధంగా, హాస్పిటల్ లో వెరిఫికేషన్ ప్రక్రియ కూడా కఠినతరం చేసింది. ఫేక్ బిల్లులతో సీఎంఆర్ఎఫ్​కు దరఖాస్తు చేయకుండా అడ్డుకట్ట వేసింది.