తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక ఎడ్యుకేషన్ సమస్యలను పరిష్కరించింది. విద్యారంగం బలోపేతానికి ఏండ్ల నుంచి అడ్డుగా ఉన్న అనేక పెండింగ్ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. అటు స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ దాకా, ఇటు టీచర్ల నుంచి స్టూడెంట్ల వరకూ అన్ని రకాల సమస్యలకు ప్రజాప్రభుత్వం చెక్ పెడుతూ ముందుకు నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి.. విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో కీలక నిర్ణయాలన్నీ వేగంగా తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీల అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. దానికి అనుగుణంగా ఇటీవల కాలంలో కీలకమైన నియామకాలు చేపడుతోంది. అటు సర్కారు బడుల్లో కొత్త టీచర్లు రాగా.. ఇటు యూనివర్సిటీలకు కొత్త వీసీలు వచ్చారు. టీచర్లను, బడులను పర్యవేక్షించేందుకు సర్కారు ఎంఈఓలనూ నియమించింది. అదేవిధంగా వర్సిటీలను కోఆర్డినేట్ చేసేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, వైస్ చైర్మన్‌నూ రిక్రూట్ చేసింది. విద్యారంగంలో సంస్కరణల కోసం విద్యాకమిషన్.. పలు సలహాలు, సూచనలు చేసేందుకు విద్యావేత్తలతో అడ్వైజరీ కమిటీని నియమించింది. వేలాది మంది టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లను కల్పించింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తికాక ముందే విద్యారంగ అభివృద్ధికి ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది.
సర్కారు బడుల్లోకి కొత్తగా పదివేలకుపైగా కొత్తసార్లు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ 2024ను సర్కారు నిర్వహించింది. పరీక్షలు నిర్వహించిన రెండు నెలల్లోనే నియామక పత్రాలు అందించడం విద్యాశాఖ చరిత్రలో ఇదే తొలిసారి. ఎల్బీ స్టేడియంలో ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. కొత్తగా 2,629 మంది స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజీ పండిట్లు 727 మంది, పీఈటీలు 182 మంది, ఎస్జీటీలు 6,508 మంది, ఎస్ఏ (స్పెషల్) 220, ఎస్జీటీ (స్పెషల్) 796 పోస్టులను సర్కారు భర్తీ చేసింది. దీంతో బడుల్లో టీచర్ల కొరత తీరింది. పరీక్షలు నిర్వహించిన 55 రోజుల్లోనే ఫలితాలు ఇవ్వడం, రిజల్ట్ ఇచ్చిన పదిరోజుల్లోనే రిక్రూట్మెంట్ చేయడం చరిత్రాత్మకం. ఇటీవలే కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సుమారు వెయ్యి పోస్టులను నింపింది. సర్కారు స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించింది. అన్ని బడుల్లో స్కావెంజర్లను నియమించింది.
మండలానికో ఎంఈఓ
సర్వీస్ సమస్యతో ఎన్నో ఏండ్ల నుంచి ఎంఈఓల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మండలానికి ఒక ఇన్చార్జ్ ఎంఈఓలనూ నియమించేందుకు గత ప్రభుత్వం సాహసం చేయలేదు. ఉన్న ఇన్‌చార్జ్‌లు ఒక్కొక్కరు పది మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉండేవారు. దీంతో సర్కారు స్కూళ్ల పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది. అయితే, కాంగ్రెస్ సర్కారు ఇటీవల మండలానికొక ఇన్చార్జ్ ఎంఈఓను నియమించింది. రాష్ట్రంలో కేవలం16 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉండగా, మిగిలిన 609 మండలాల్లో సీనియర్ హెడ్మాస్టర్లకు ఇన్చార్జ్ ఎంఈఓలుగా బాధ్యతలు ఇవ్వడంతో సర్కారు బడుల పర్యవేక్షణ పెరిగింది. పాలిటెక్నిక్ కాలేజీలు, సర్కారు జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్స్నూ ఇటీవలే నియమించింది.
వర్సిటీలకు కొత్త వీసీలు,ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు
రాష్ట్రంలోని సర్కారు వర్సిటీలకు కొత్త వీసీలను ప్రభుత్వం నియమించింది. పారదర్శకంగా ఎలాంటి పైరవీలకు తావులేకుండా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని టాలెంట్, క్వాలిటీకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో 9 యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించగా, టెక్నికల్ ఇష్యూతో మరో రెండు వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలను రిక్రూట్ చేసింది.
గత సర్కారు ఏండ్ల తరబడి ఐఏఎస్‌లను ఇన్చార్జ్ వీసీలుగా పెట్టింది. కాగా, గత నెలలోనే కొత్త వీసీలతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కూ కొత్త టీమ్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డిని కౌన్సిల్‌కు చైర్మన్‌గా, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను వైస్ చైర్మన్‌గా నియమించింది. రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెంచేందుకుప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళితోపాటు మరో ముగ్గురిని సభ్యులుగా నియమించింది. ఈ కమిషన్‌కు ఆరుగురు సీనియర్ విద్యావేత్తలతో అడ్వైజరీ కమిటీని సర్కారు నియమించింది.
11 ఏండ్ల తర్వాత మోడల్ టీచర్ల బదిలీలు
రాష్ట్రంలో మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలపై సర్కారు నిర్ణయం వందలాది టీచర్ల కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013–14 విద్యాసంవత్సరంలో రిక్రూట్ అయిన స్కూళ్లలోనే ఇప్పటివరకూ కొనసాగారు.
సీనియార్టీ అంశంపై హైకోర్టులో కేసు వల్ల బదిలీలు, ప్రమోషన్లు ఆగిపోయాయి. హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన మరుసటిరోజే ప్రభుత్వం బదిలీలు నిర్వహించింది. దీంతో 11 ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్ 89 మంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 1,923 మంది, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 745 మంది బదిలీ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో సర్కారు స్కూళ్లలో పనిచేసే 35వేల మంది టీచర్లకు బదిలీలు కాగా, 21 వేల మందికి ప్రమోషన్లు లభించాయి. వీరితో పాటు సుమారు 9 వేల మంది లాంగ్వేజీ పండిట్లకు, 2 వేల మంది పీఈటీలు స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్అయ్యారు.
డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు
సర్కారు హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులకు కాంగ్రెస్ సర్కారు భారీగా డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచింది. మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివే స్టూడెంట్లకు రూ.950గా ఉన్న డైట్ చార్జీని రూ.1,330కి, 8వ తరగతి నుంచి టెన్త్ వరకు స్టూడెంట్లకు ఇప్పటివరకు ఉన్న రూ.1,100 నుంచి రూ.1,540కి, ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1,500గా ఉన్న డైట్ చార్జీని రూ.2,100కి పెంచింది. అమ్మాయిలకు కాస్మోటిక్ చార్జీలనూ ఏడో తరగతి వరకూ రూ.55 నుంచి రూ.175కు, 8 నుంచి టెన్త్ వరకు రూ.75 నుంచి రూ.275కు పెంచింది. డైట్చార్జీల పెంపుతో లక్షలాది మంది పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే అవకాశం లభించింది.
స్కిల్ వర్సిటీ ఏర్పాటు
విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. పీపీపీ మోడ్‌లో 20 కోర్సులతో దీన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ వర్సిటీకి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను చైర్మన్‌గా నియమించింది. ఈ ఏడాదే క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. దీంట్లో చదివిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం.
మరోపక్క రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలు (ఏటీసీ)గా తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు వేర్వేరు చోట్ల, అందులోనూ ఎక్కువగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అలా కాకుండా వాటన్నింటిని ఒకే క్యాంపస్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఈ స్కూళ్ల ద్వారా విద్యార్థుల మధ్య స్నేహా సంబంధాలు పెరుగుతాయని సర్కారు భావిస్తోంది.
సర్కారు బడులపై నమ్మకం కలిగించాలి
ఏడాది కాలంలోనే అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన పలు సమస్యల పరిష్కారంవైపూ ప్రజాప్రభుత్వం అడుగు వేయాలి. తల్లిదండ్రులకు సర్కారు బడులపై నమ్మకం కల్గించేలా చర్యలు కొనసాగించాలి. దీనికిగాను బడుల్లో పర్యవేక్షణ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిన సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కారం చేయాల్సి ఉంది. యూనివర్సిటీల బలోపేతానికి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులనూ భర్తీ చేయాలి. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో సైతం ఫీజులను నియంత్రించాలి. కొరాఠి కమిషన్ సిఫారసుల మేరకు ఎడ్యుకేషన్‌కు రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలి.
- గండ్ర నవీన్, వెలుగు, సీనియర్ జర్నలిస్ట్–