ఆదిలాబాద్​కు కార్పొరేషన్​ హోదా .. అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీల ఏర్పాటుకు సర్కార్​ కసరత్తు

ఆదిలాబాద్​కు కార్పొరేషన్​ హోదా .. అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీల ఏర్పాటుకు సర్కార్​ కసరత్తు
  • గ్రేడ్ వన్​ స్థాయి బల్దియాగా ఉన్న ఆదిలాబాద్​కు అవకాశం    
  • ప్రతిపాదనలు  పంపించాలని కలెక్టర్ కు ఆదేశాలు
  • ఇప్పటికే 49 వార్డులతో 1.90 లక్షల జనాభాతో విస్తరించిన బల్దియా 

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపాలిటీల స్థాయిని పెంచి మరింత డెవలప్ మెంట్ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఇటీవల ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపాలిటీల రూపురేఖలు, వాటికి ఆనుకొని ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో గ్రేడ్ వన్​గా ఉన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్​గా మారే అవకాశం ఉంది. ఆదిలాబాద్ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు సమకూరనున్నాయి. 

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

ప్రభుత్వం ఆదేశాలతో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించారు. కలెక్టర్​తో పాటు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, డీపీవో, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉండి విలీన గ్రామాల ప్రక్రియపై నివేదిక రూపొందించనున్నారు. అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ఏర్పాటు కావాలంటే పట్టణానికి కనీసం 15 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను కలుపుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్న మైదాన ప్రాంత గ్రామాలను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నారు. అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ పరిధి ఎంత వరకు ఉండాలి? 2024 వరకు జనాభా ఎంత ఉండాలనేది స్పష్టమైన లెక్కలు సేకరించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్​కు ఆనుకొని మావల, బట్టి సావర్గాం, పొచ్చర, పొన్నారి గ్రామాలను విలీనం చేసే ప్రక్రియపై కసరత్తు ప్రారంభమైంది.

ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా మ్యాప్​ను రూపొందిస్తున్నారు. అయితే ఆదిలాబాద్ పట్టణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చాలా వరకు ఏజెన్సీ పరిధిలోకి రానుండడంతో వాటిని పక్కన పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా 1.90 లక్షల జనాభా ఉంది. గతంలో 36 వార్డులు ఉన్న పట్టణాన్ని 49కి పెంచి గ్రేడ్ వన్​గా మార్చారు. విలీన గ్రామాలతో మరో రెండు మూడు వార్డులు, 15 వేల జనాభా పెరిగే అవకాశం ఉంది. కరీంనగర్, వరంగల్​కు అర్బన్ అథారిటీలు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 

మరింత అభివృద్ధి

అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పూర్తి నివేదిక సిద్ధం చేసిన తర్వాత కలెక్టర్ ఆమోద ముద్ర వేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆదిలాబాద్ అథారిటీ ఏర్పడితే అభివృద్ధికి నిధులు పెరగనున్నాయి. నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ ను నియమిస్తారు. 25 ఏండ్ల భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక రూపొందించి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. ఈ ప్లాన్ కు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తాయి.