సర్కార్​పై రిటైర్మెంట్ల భారం!

సర్కార్​పై రిటైర్మెంట్ల భారం!
  • రిటైర్మెంట్ ఏజ్​ను 61కి పెంచి మూడేండ్ల 
  • భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్
  • కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్​ను 63 ఏండ్లకు పెంచుతుందనే ప్రచారం
  • అలాంటి ప్రతిపాదనేదీ లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు
  • అలా చేస్తే జాబ్ ​క్యాలెండర్, ప్రమోషన్లపై ప్రభావం పడ్తుందని భావిస్తున్న ప్రభుత్వం
  • ఐదేండ్లలో రిటైర్ కానున్న  ప్రభుత్వ ఉద్యోగులు 50,000 
  •  రిటైర్మెంట్​​ బెనిఫిట్స్, పెన్షన్స్ రూపంలో రాష్ట్ర ఖజానాపై భారం 40,000  కోట్లు
  • పోయినేడాది ఏప్రిల్​ నుంచి పదవీ విరమణ పొందినవారు 8,000
  • ప్రతి నెలా అదనంగా చెల్లించాల్సింది 600కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడేండ్ల తర్వాత గతేడాది ఏప్రిల్​ నుంచి మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల భారం కాంగ్రెస్​ సర్కారుపై భారీగా పడ్తున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్​ రూపంలో ప్రస్తుతం ఏటా రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ప్రతి నెలా రిటైర్ ​అవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ మేరకు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగు తున్నది. 2021లో అప్పటి ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచింది. 

దీంతో  మూడేండ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగకపోవడంతో గత బీఆర్ఎస్​ సర్కార్ హాయిగా ఊపిరి పీల్చుకుంది.  కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగో నెల (2024 ఏప్రిల్)​ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ఈ 9 నెలల్లో ఏకంగా 8 వేల మంది ఉద్యోగ విరమణ చేశారు. వీరితో కలుపుకుని ఈ ఐదేండ్లలో 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్​కానున్నారు.

దీంతో వీరి రిటైర్మెంట్​బెనిఫిట్స్, పెన్షన్స్​ రూపంలో కాంగ్రెస్​ సర్కారుపై ఏకంగా రూ.40 వేల కోట్ల అదనపు భారం పడనుంది. అసలే గత సర్కార్ చేసిన మోతకోలు అప్పులతో స్కీమ్​ల అమలుకు తిప్పలు పడ్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వం.. ఈ అదనపు భారంపై ఆందోళన చెందుతున్నది.  

గత బీఆర్ఎస్​ సర్కార్ భారం కాంగ్రెస్​ ప్రభుత్వం నెత్తిన.. 

2021లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచింది. దీంతో గత మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (క్లాస్‌–4 ఉద్యోగులు మినహా) రిటైర్మెంట్లు జరగలేదు.   మూడేండ్ల తర్వాత అంటే 2024 ఏప్రిల్​ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే నాటికి రిటైర్​అయ్యే ఉద్యోగుల సంఖ్య  9,844కు చేరనుంది. ఇప్పటికే 8 వేల మంది దాకా ఉద్యోగులు పదవీ విరమణ చేశారు.

 రానున్న 2025–26లో 9,768 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2028–29 వరకు 50 వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతారని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రిటైరయ్యే వారి సగటు బేసిక్​పే రూ.40వేల దాకా ఉంటుందని అంచనా. దీనికి హెచ్‌‌ఆర్‌‌ఏ, సీసీఏ, డీఏలు కలిపితే ఈ మొత్తం రూ.60 వేల వరకు ఉంటుంది. రిటైరయ్యే ప్రతి ఉద్యోగికి లీవ్‌‌ శాలరీల కింద 10 నెలల వేతనాన్ని.. అంటే రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమిటేషన్‌‌ కింద రూ.20 లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి యావరేజ్​గా చెల్లించాలి.

అంటే సగటున ప్రతి రిటైర్డ్‌‌ ఉద్యోగికి  రూ.40 లక్షల వరకు తక్షణ బెనిఫిట్లను ఇవ్వాల్సిందే. ఉద్యోగుల స్థాయిని బట్టి రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షలు, ఆపైన కూడా చెల్లించాల్సి వస్తుంది. దీంతో రిటైర్​ అవుతున్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్లను చెల్లించేందుకు, పెన్షన్​ఇతరత్రా వాటిపై  ప్రభుత్వంపై ప్రతినెలా యావరేజ్​గా రూ.600 కోట్లు అదనపు భారం పడుతున్నది.  

ఇప్పటికే తిప్పలు.. గట్టెక్కే మార్గాలపై మల్లగుల్లాలు..

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 35 శాతం మేర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, బెనిఫిట్స్ వంటి​వాటికే పోతున్నది. 2014–15లో జీతభత్యాలు, పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సొమ్ము రూ. 21,233 కోట్లుంటే.. ఈ ఆర్థిక సంవత్సరం అది రూ.59,013 కోట్లకు చేరింది. గత పదేండ్ల కాలంలో  చెల్లింపులు ఏకంగా 177 శాతం మేర పెరిగాయి. 2017–18లో రాష్ట్రంలో మొత్తం 2,57,604 మంది పెన్షన్​దారులకు ప్రభుత్వం రూ.11,417 కోట్లను  చెల్లించింది.

ఆ తర్వాత  2023–24లో 2,59,788 మందికి రూ.16,498 కోట్ల దాకా చెల్లింపులు చేసింది. కొత్త వేతన సవరణ ఒప్పందం (పీఆర్సీ)తో పాటు డీఏ పెంపు పెండింగ్​లో ఉన్నాయి. వాటిని కూడా అమలు చేస్తేఈ భారం మరింత పెరుగుతుంది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్‌‌ బిల్లులు, సరెండర్‌‌ లీవ్స్‌‌లకు కూడా చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో నిధుల సర్దుబాటుకు ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మెడికల్‌‌ బిల్లుల చెల్లింపు కూడా కష్టమవుతుండటం, ఏటా రిటైర్మెంట్ల భారం మరింత పెరుగుతుండటంతో ఈ గండాన్ని ఎట్ల గట్టెక్కాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడ్తోంది.

ALSO READ : దావోస్‎లో తెలంగాణకు జాక్ పాట్.. సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో రూ.45 వేల కోట్ల ఒప్పందం

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం మాదిరే కాంగ్రెస్​సర్కారు కూడా ఉద్యోగ విరమణ వయసును మరో మూడేండ్లు పెంచుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. కానీ సెక్రటేరియెట్​వర్గాలు మాత్రం రిటైర్మెంట్ వయసును మరింత పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తున్నాయి. ఏటా జాబ్​క్యాలెండర్​ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్​సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియ కూడా కొనసాగిస్తోంది. అలాగే కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు నిలిచిపోయే ప్రమాదముందని, ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని భావిస్తున్న ప్రభుత్వం.. పదవీవిరమణ వయసు పెంపు దిశగా ఆలోచించడం లేదని తెలుస్తోంది.