ర్యాలంపాడు రిపేర్లకు గ్రీన్​ సిగ్నల్​ రూ.144 కోట్లతో సర్కారుకు ప్రపోజల్స్​

  • సర్కారుకు ఎస్టిమేషన్లు పంపించిన ఇరిగేషన్  ఆఫీసర్లు
  • పదేండ్ల బీఆర్ఎస్  పాలనలో నెట్టెంపాడు ప్రాజెక్టుపై  వివక్ష    
  • రిపేర్లు చేయకపోవడంతో సగం ఆయకట్టుకే నీళ్లు 
  • మంత్రి ఉత్తం హామీతో రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

గద్వాల, వెలుగు: బీఆర్ఎస్  హయంలో నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్  రిపేర్లపై కాంగ్రెస్  సర్కారు దృష్టి పెట్టింది. రిపేర్ల ఎస్టిమేషన్​ పంపించాలని ఆదేశించడంతో, ఇటీవల ఇరిగేషన్  ఆఫీసర్లు నివేదిక పంపించారు. ర్యాలంపాడు రిజర్వాయర్  రిపేర్ల కోసం రూ.144 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్  రిపేర్లు కంప్లీట్  చేస్తే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

 రిపేర్లపై దృష్టి పెట్టకపోవడంతో నాలుగేండ్ల నుంచి సగం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఇరిగేషన్  మినిస్టర్  ఉత్తంకుమార్ రెడ్డి నెట్టెంపాడు లిఫ్ట్  ఇరిగేషన్  పనులను పరిశీలించి, రిపేర్లు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

కట్ట వెడల్పు, గ్రౌటింగ్  కీలకం..

కట్ట బలహీనంగా ఉండడంతో రిపేర్లు చేయాలని ఆఫీసర్లు గుర్తించారు. కట్ట ఎత్తు పెంచడంతో పాటు వెడల్పు చేసి గ్రౌటింగ్  చేయాలని నిపుణులు సూచించారు. రివిట్ మెంట్ పై భాగంలో కొత్త టెక్నాలజీ ఉపయోగించి మందంపాటి పాలిథిన్  కవర్  వేసి దానిపై జాలి ఏర్పాటు చేసి గ్రౌటింగ్  చేయాలని సూచించడంతో, దీనికి రూ.144 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 

కాలయాపనతోనే కాలం వెళ్లదీసిన్రు..

ర్యాలంపాడు రిజర్వాయర్ కు ఐదేండ్ల కింద బుంగలు పడి లీకేజీ అవుతున్నా.. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం రైతులకు శాపంగా మారింది. సర్వేలు, రిటైర్డ్  ఇంజనీర్ల బృందం తనిఖీల పేరుతో కాలయాపన చేశారే తప్ప రిపేర్లు చేయకపోవడంతో నాలుగేండ్ల నుంచి సగం ఆయకట్టుకే నీరు అందుతోంది. సర్వే చేసి రెండేండ్లు దాటినా, ఇప్పటివరకు సర్వే రిపోర్ట్  కూడా బయటపెట్టలేదు. కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులో 80 శాతం పనులు కంప్లీట్  చేశారు. 20 శాతం పనులు మిగిలాయి. ఆ తరువాత బీఆర్ఎస్  ప్రభుత్వం రావడంతో మిగిలిన పనులను కంప్లీట్  చేయలేదు.

2019లో సీపేజీ గుర్తించినా..

కృష్ణ బ్యాక్  వాటర్  నుంచి నీటిని ఎత్తిపోసేలా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు. ఇందులోభాగంగా ర్యాలంపాడు, గుడ్డం దొడ్డి, ముచ్చోని పల్లి, సంగాల, నాగర్ దొడ్డి రిజర్వాయర్లు నిర్మించారు. ఇందులో 10 టీఎంసీల నీరు నిలువ చేసుకోవాల్సి ఉంది. నెట్టెంపాడు లిఫ్ట్​లోని ర్యాలంపాడు రిజర్వాయర్  పెద్దది. ఈ రిజర్వాయర్ ను నాలుగు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అప్పటి బీఆర్ఎస్  సర్కారు ముందు నుంచి వివక్ష చూపుతూ వచ్చింది.

కనీసం మెయింటెనెన్స్​కు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో రిజర్వాయర్లు, కెనాల్స్‌‌‌‌‌‌‌‌ దెబ్బతిన్నాయి. ర్యాలంపాడు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌కట్ట నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయని 2019లోనే గుర్తించారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీపేజీ మరింత పెరిగింది. రైతుల నిరసనతో 2021లో రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్ల బృందం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించింది. పూర్తి స్థాయిలో నింపితే కట్టకు ప్రమాదం అని చెప్పి సామర్థ్యాన్ని సగానికి తగ్గించారు.  దీంతో గత మూడేండ్ల నుంచి రెండు టీఎంసీల నీటినే నింపుతున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్  లెఫ్ట్  కెనాల్  నుంచి 25 వేల ఎకరాలకు, రైట్  కెనాల్  ద్వారా 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం రెండు టీఎంసీలకు పరిమితం కావడంతో సగం ఆయకట్టుకు మాత్రమే నీళ్లిచ్చే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నెట్టెంపాడు ప్రాజెక్టు చరిత్రలోనే క్రాప్  హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని రైతులు చెబుతున్నారు.

మంత్రి హామీతో రైతుల్లో ఆశలు..

ఇరిగేషన్  మినిస్టర్  ఉత్తంకుమార్ రెడ్డి గద్వాల జిల్లా పర్యటనలో ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్లపై క్లారిటీ ఇవ్వడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వంద కోట్లు ఖర్చు అయినా రిపేర్ల కోసం నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పడంతో ఆఫీసర్లు ఎస్టిమేషన్లు రెడీ చేసి ప్రభుత్వానికి పంపించారు. బీఆర్ఎస్​ హయాంలో వివక్షకు గురైన నెట్టెంపాడు లిఫ్ట్  కాంగ్రెస్  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పూర్వ వైభవం సంతరించుకుంటుందని అంటున్నారు.

నివేదిక పంపించాం.

ర్యాలంపాడు రిజర్వాయర్  రిపేర్లపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. రూ.144 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా రిపేర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. వచ్చే వానాకాలం నాటికి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రహీముద్దీన్, ఎస్ఈ, జూరాల ప్రాజెక్టు