- తిష్టవేసిన వారిలోపలువురి ట్రాన్స్ ఫర్
- త్వరలో ఇంకొందరిని మార్చే చాన్స్
- జడ్సీలుగా ముగ్గురు ఐఏఎస్ లకు బాధ్యతలు
- మిగతా జోన్లలో వారినే నియమించాలనే చర్చ
హైదరాబాద్, వెలుగు : బల్దియాపై కొత్త సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏండ్లుగా తిష్టవేసి ఆఫీసర్లపై వేటు వేస్తోంది. గత బీఆర్ఎస్ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన కొందరిని ఇప్పటికే బదిలీ చేసింది. మరికొందరిని ట్రాన్స్ ఫర్ చేసేందుకు సిద్ధమవుతుంది. రిటైర్డ్ అయి కూడా బల్దియాలోనే కీలక పదవుల్లో ఉన్నవారితో పాటు డిప్యూటేషన్ పై వచ్చిన ఆఫీసర్లు కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఐఏఎస్‌లు పనిచేసే చోట అర్హత లేని వారికి గత ప్రభుత్వ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం అలాంటివారిపై బదిలీ వేటు పడుతుంది. ఇందులో భాగంగానే ఏండ్లుగా ఒకేచోట ఉండిపోయిన జోనల్ కమిషనర్లు ట్రాన్స్ ఫర్ అయ్యారు.
గ్రేటర్ లోని ఆరు జోన్లలో ప్రస్తుతం మూడు జోన్లలో ముగ్గురు ఐఏఎస్, మరో ముగ్గురు నాన్ కేడర్ ఐఏఎస్‌లు మాత్రమే ఉన్నారు. మొన్నటి వరకు ఒక్కరు మాత్రమే ఐఏఎస్ ఉండగా, ఇటీవల ఇద్దరిని కేటాయించింది. మిగతా మూడు జోన్లలోనూ ఐఏఎస్‌లను నియమిస్తే మరింత అభివృద్ధి జరిగే చాన్స్ ఉందనే చర్చ జరుగుతుంది. బల్దియాపై సర్కార్ సమీక్ష కు ముందే బదిలీలు చేపట్టింది.
రిటైర్డ్ అయినా అవే పదవుల్లో..
బల్దియాలో ప్రస్తుత అధికారుల్లో సగానికిపైగా 4 ఏండ్లకు మించిన వారే ఉండగా.. అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సహా పలువురు ఆఫీసర్లు తిష్టవేశారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడే బల్దియా పరిధిలోనే బదిలీలు చేస్తున్నారే తప్ప వేరే ప్రాంతాలకు పోవడంలేదు. ఎన్నికలు అయిపోయాక ఎవరి పోస్ట్ లోకి వారే వస్తున్నారు. కొన్ని కీలక పదవుల్లో రిటైర్డ్ అయినా కూడా వారినే కొనసాగిస్తున్నారు.
ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనెడీ, హౌసింగ్ సీఈ సురేశ్, కంట్రోల్ రూం ఓఎస్డీ అనురాధ రిటైర్డ్అయినా కూడా ఇక్కడే ఉన్నారు. కమిషనర్ పేషీ, ఎలక్షన్ బ్రాంచ్ , టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ తదితర విభాగాలతో పాటు మేయర్ ఆఫీసులో కూడా రిటైర్డ్ అధికారులే ఇంకా పని చేస్తున్నారు. వీరు బల్దియాను వీడకపోతుండగా కిందిస్థాయిలో ఉన్నవారు పదోన్నతులు కోల్పోతున్నారు.
అధికారుల్లో టెన్షన్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకుల మెప్పు కోసమే బల్దియాలో కొందరు అధికారులు పని చేశారు. మంత్రితో మాత్రమే తమకు అవసరం అన్నట్లుగా వ్యవహరించారు. ప్రజలకు అందుబాటులో ఉండని అధికారులు కూడా ఉన్నారు. ఏవైనా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొద్దామని ఫోన్లు చేస్తే లిఫ్ట్ కూడా చేయరు. కొత్త సర్కార్ ఏర్పాటైన తర్వాత వర్కింగ్ స్టైల్ మారింది. దీంతో అధికారులు కూడా టెన్షన్ లో పడ్డారు. ఏండ్లకు ఏండ్లు తిష్టవేసినవారు తమ బదిలీ ఎటోననే డైలామాలో ఉన్నారు.
ప్రస్తుతం ముగ్గురు, నలుగురు ఆఫీసర్లు కలిస్తే చాలు ఏం జరుగుతుందోనని చర్చించుకుంటున్నారు. గత సర్కార్ హయంలో బల్దియాలో సీఎంగా ఒకరు ఉండగా, మున్సిపల్ మంత్రిగా మరొకరు ఉండగా ఇప్పుడు అన్ని సీఎం రేవంత్ వద్దే ఉన్నాయి.