
- మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 9 వేల మందికి పట్టాలు
- సిద్దాపూర్, అలియాబాద్‌లో లబ్ధిదారుల ఎదురుచూపులు
- పదేళ్లుగా పొజిషన్ చూపని బీఆర్‌ఎస్ సర్కారు
- మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి/సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ సదాశివపేట, కొండాపూర్ మండలాల పరిధిలోని సిద్ధాపూర్, అలియాబాద్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 9 వేల మందికి భూమి పట్టాలు ఇచ్చినా ఇప్పటి వరకు వారికి పొజిషన్ చూపించలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో బీఆర్‌ఎస్ సర్కారు అధికారంలో వచ్చింది. కానీ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పేదలకు ఇచ్చిన భూములకు మాత్రం పొజిషన్ చూపించలేదు.
2014 లో ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఓడిపోవడం.. స్థానిక ఎమ్మెల్యే మారడంతో సిద్ధాపూర్, అలియాబాద్ లబ్ధిదారులకు పొజిషన్ సమస్య తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలకు ఇప్పటి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి హయంలోనైనా పొజిషన్ ఇప్పించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.
అలియాబాద్ సిద్దాపూర్‌లో పంపిణీ
అలియాబాద్‌లోని 142 ఎకరాల్లో 4 వేల మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వగా, సిద్దాపూర్‌లో 184 ఎకరాల్లో 5 వేల మందికి పట్టాలు ఇచ్చారు. ఒక్కొక్కరికి 90 గజాల స్థలం ఉన్నట్లు పట్టా ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తుండగా పొజిషన్ చూపించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టిన సమయంలో సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి గెలిచినప్పటికీ పొలిటికల్ ఇష్యూస్ కారణంగా పేదలకు ఆ ఇండ్ల స్థలాలకు పొజిషన్ చూపించలేకపోయారు. అనేక సార్లు మంత్రులను కలిసి విన్నవించుకున్నప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఏకంగా అసెంబ్లీలోనే ఈ ఇళ్ల పట్టాల పొజిషన్ గురించి చర్చించారు. అయినా నిరుపేదలకు స్థలాలు దక్కలేదు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో...
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో అలియాబాద్, సిద్ధాపూర్ లో పేదల ఇండ్ల స్థలాల పొజిషన్ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. సంగారెడ్డి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఓడిపోయినప్పటికీ పేదల ఇళ్ల స్థలాల పొజిషన్ గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి సమస్యను వివరించగా, స్పందించిన మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి ఫోన్ చేసి విషయం అడిగి తెలుసుకున్నారు. నిజమైన లబ్ధిదారులకు పొజిషన్ చూపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు మాత్రం కాంగ్రెస్ సర్కారుపై గంపెడాశతో ఉన్నారు. ఇప్పటికైనా తమకు పొజిషన్ చూపించి ఇళ్ల జాగలు ఇస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. -----