- మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, వెలుగు : రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వడ్లు, పత్తి, సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వడ్లను కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు చెల్లించామని, సన్న వడ్లకు రూ.500 బోనస ఇచ్చామని గుర్తు చేశారు. సిద్దిపేట అగ్రికల్చర్ యార్డులో శుక్రవారం కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
జనవరి 26 నుంచి వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద రూ.12 వేలు ఇవ్వనున్నామని చెప్పారు. కందులను ప్రభుత్వ మద్దతు ధర రూ.7,550కు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే ముమ్మరంగా సాగుతోందని, ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా చేపడుతామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే ఈ ప్రాంతంలో పర్యటించి, ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.
కార్యక్రమంలో కలెక్టర మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో సదానందం, లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, మార్కెటింగ్ అధికారి నాగరాజు, సిద్దిపేట మార్కెట్ సెక్రటరీ వెంకటయ్య పాల్గొన్నారు. మరో వైపు సిద్దిపేట జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలంటూ తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా నాయకుడు గ్యాదరి పరమేశ్వర్, విక్రం రెడ్డి శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడమే కాకుండా సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.