లెండి ప్రాజెక్టుపై ఆశలు .. తాజా బడ్జెట్​లో రూ.42 కోట్లు కేటాయింపు

లెండి ప్రాజెక్టుపై ఆశలు .. తాజా బడ్జెట్​లో రూ.42 కోట్లు కేటాయింపు
  • మహారాష్ట్రకు రూ.21 కోట్లు డిపాజిట్​కు అవకాశం
  • కాల్వల భూ సేకరణ కోసం మరో రూ.21 కోట్లు 
  • త్వరలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారుల మీటింగ్
  • ప్రాజెక్ట్​ పూర్తయితే జుక్కల్ నియోజకవర్గం సస్యశ్యామలం

కామారెడ్డి, వెలుగు: అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టుకు కాంగ్రెస్​ ప్రభుత్వం బడ్జెట్​లో రూ.42 కోట్లు కేటాయించింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కదలిక రానుంది.  త్వరలోనే ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ జరగనుంది. అగిపోయిన లెండి ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం షూరు చేసింది. పరిస్థితులు అనుకూలించి త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తైతే కామారెడ్డి జిల్లా జుక్కల్​ నియోజకవర్గంలో 22 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. మహారాష్ర్టలోని దెగ్లూర్ తాలుకాలో లెండి ఉప నదిపై ప్రాజెక్టు నిర్మించాలని ఇరు రాష్ట్రాలు 30 ఏండ్ల కింద నిర్ణయించాయి. దెగ్లూర్ తాలుకాలోని గోజేగావ్– రావుల్గావ్ మధ్య లెండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 

నిర్మాణ ఖర్చులు 62 శాతం మహారాష్ర్ట, 38 శాతం మన ప్రభుత్వం భరించాలి. 6.36 టీఎంసీల కెపాసిటీతో నిర్మించే ప్రాజెక్టు ద్వారా 49 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. దెగ్లూర్​ను ఆనుకొని ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో 22వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 3 దశాబ్దాల క్రితం చేపట్టిన ప్రాజెక్ట్​ కావడంతో అప్పట్లో వేసిన నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరిగింది.  మన వాటా కింద మహారాష్ర్టకు రూ. 400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే రూ. 189 కోట్లు చెల్లించారు. 

ఇప్పటికే  ప్రాజెక్టు సంబంధించి 10 గేట్లు బిగించారు. కొంత మేర కాల్వ, ఇతర పనులు జరిగాయి.  మన జిల్లాలో కొంత కాల్వ తవ్వకాలు చేపట్టారు. 13 ఏండ్ల నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోయాయి. రాష్ర్ట విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఒకటి, రెండు సార్లు మహారాష్ర్ట  ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపింది. పనుల విషయంలో కొంత కదలిక వచ్చింది. కొద్ది నెలల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన స్టేట్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, రైతులు లెండి ప్రాజెక్టు సమస్యను తీసుకెళ్లారు. 

బడ్జెట్​లో ఫండ్స్ కేటాయింపు..

కాంగ్రెస్​ ప్రభుత్వం లెండి ప్రాజెక్టుకు రూ.42 కోట్లు కేటాయించింది.  ఇందులో రూ. 21 కోట్లు మహారాష్ర్ట ప్రభుత్వానికి డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా మిగతా ఫండ్స్ చెల్లించాల్సి ఉంది. మరో రూ. 21 కోట్లతో మన ఏరియాలో కాల్వల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ఇతర వాటికి ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్ట్​ నిర్మాణంపై త్వరలో తెలంగాణ, మహారాష్ర్ట ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మీటింగ్ జరగనుంది.  ఈ వారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నట్లు తెలిసింది.  లెండి ప్రాజెక్టు ద్వారా మద్నూర్, జుక్కల్, డొంగ్లి మండలాల్లోని భూములు సస్యశ్యామలం కానున్నాయి. దశాబ్దాల రైతుల కల నెరవేరనున్నది.  

ఇక్కడ కూడా వర్క్స్ కంప్లీట్ చేసేలా చూస్తాం..

లెండి ప్రాజేక్టుకు రూ. 42 కోట్ల ఫండ్స్ కేటాయింపులతో మన వాటా కింద మహారాష్ర్టకు ఫండ్ప్ డిపాజిట్​తోపాటు, రూ. 21 కోట్లతో కాల్వల కోసం  భూ సేకరణ, పనులు చేపట్టడానికి కేటాయిస్తాం. అక్కడ ప్రాజెక్టు పనులు పూర్తై నీళ్లు నింపే సరికి మన దగ్గర కాల్వల పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 

శ్రీనివాస్, ఇరిగేషన్ సీఈ,  కామారెడ్డి