- స్పెషల్ డ్రైవ్‌లో పరిష్కరించేందుకు చర్యలు
- క్షేత్రస్థాయిలో పరిశీలనకు స్పెషల్ టీమ్‌లు
వనపర్తి, వెలుగు: ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సంబంధ సమస్యలకు ధరణి స్పెషల్ డ్రైవ్‌లో పరిష్కారం దొరుకుతుందని రైతులు ఆశిస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ధరణి సమస్యలను పట్టించుకోకపోవడంతో రైతులు ప్రజావాణితో పాటు మీ సేవా కేంద్రాల ద్వారా తమ సమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్లన్నీ ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉండగా, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. జిల్లాల వారీగా పెండింగ్ దరఖాస్తులపై రాష్ట్ర స్థాయి ఆఫీసర్లు రివ్యూ చేశారు. వివిధ కారణాలతో పరిష్కారం కాని అప్లికేషన్లను పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ స్థాయిలో ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని గుర్తించిన ఆఫీసర్లు,వాటి పరిష్కారంపై దృష్టి పెట్టారు.
పెండింగ్ అప్లికేషన్లు ఇలా..
జిల్లాలో ధరణి సమస్యలపై 37,620 అర్జీలు వచ్చాయి. వాటిలో 7,653 దరఖాస్తులను తిరస్కరించినట్లు రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. మిగిలిన 29,967 అప్లికేషన్లలో 25,210 పరిష్కరించగా, 4,756 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. కలెక్టర్ స్థాయిలో 1,687, అడిషనల్ కలెక్టర్ స్థాయిలో 69, ఆర్డీవో స్థాయిలో 506, తహసీల్దార్ల స్థాయిలో 2,494 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటికీ స్పెషల్ డ్రైవ్‌లో పరిష్కారం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
పొంతనలేని భూ కొలతలు
రికార్డుల్లో, క్షేత్రస్థాయిలో భూముల కొలతల్లో తేడాలుండడంతో.. అలాంటి కేసులను ధరణి పార్ట్–బిలో ఉంచారు. ప్రజావాణికి వచ్చే రైతులు ఎక్కువగా తమకున్న భూమికి, రికార్డుల్లో ఉన్న భూమికి పొంతన లేదంటూ ఫిర్యాదులు చేసిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌లో రికార్డులతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం సమస్యను పరిష్కరించేందుకు మండలాల వారీగా టీమ్‌లను ఏర్పాటు చేశారు.
ధరణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ధరణి పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో తహసీల్లార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో ధరణి, మార్కెట్ విలువలు, విద్యుత్ సబ్స్టేషన్లకు భూసేకరణపై రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టా భూమిగా మార్చవద్దని సూచించారు. హిందూ సక్సెషన్ యాక్ట్, భూ రికార్డుల యాక్ట్‌లను క్షుణ్ణంగా చదివి ధరణి సమస్యలు పరిష్కరించాలన్నారు. భూ బదలాయింపు ఎన్ని రకాలు, వాటిని ఏవిధంగా నిర్ధారించుకోవాలనే అంశంపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను తెలుసుకోవాలన్నారు. పెండింగ్ మ్యుటేషన్, సక్సెషన్, కరెక్షన్ వంటి సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. అడిషనల్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేశ్, ఆర్డీవో పద్మావతి, వనపర్తి సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ పాల్గొన్నారు.
స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది..
ధరణి సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా లాగిన్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరిస్తాం.– పద్మావతి, ఆర్డీవో, వనపర్తి