- తొమ్మిదేళ్ల తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణంలో ముందడుగు
- నిధుల కేటాయింపుతో భూ సేకరణ చర్యలు చేపట్టిన ఆఫీసర్లు
- కడెం ప్రాజెక్ట్‌కు తగ్గనున్న వరద ముప్పు
ఆదిలాబాద్, వెలుగు : గత సర్కార్ నిర్లక్ష్యంతో తొమ్మిదేళ్లుగా మూలుగుతున్న ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రాజెక్ట్ కోసం నిధులు కేటాయించింది. దీంతో ఆఫీసర్లు భూ సేకరణకు సిద్ధమయ్యారు. రెండు రోజుల కింద ఆఫీసర్లు కుప్టి గ్రామ పరిసరాల్లో పర్యటించి భూములను పరిశీలించారు.
2015లోనే నిర్ణయించినా నిధులివ్వని బీఆర్‌ఎస్ నేరడిగొండ మండలం కుప్టి గ్రామం వద్ద రెండు కొండల మధ్య కడెం నదిపై ప్రాజెక్ట్ నిర్మించాలని గత సర్కార్ 2015లో నిర్ణయించింది. ఇక్కడి నుంచి కడెం ప్రాజెక్ట్‌కు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల సుమారు 2,500 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కుమారి, కుప్టీ, గాంధారి, గాజిలి, రాయధారి, మల్కలపాడు గ్రామాలను ముంపు గ్రామాలుగా గతంలోనే ప్రకటించారు.
మొదట్లో నిర్మాణ అంచనా వ్యయం రూ. 900 కోట్లు కాగా డీపీఆర్‌ను పలుమార్లు సవరించి చివరగా అంచనా వ్యయాన్ని రూ. 1,300 కోట్లుగా నిర్ధారించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 5.30 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావచ్చని, ఏడు గేట్లతో ప్రాజెక్ట్ నిర్మించవచ్చని నిర్ణయించారు.
గునీటి ప్రాజెక్ట్‌గానే కాకుండా మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు మూడు టీఎంసీలతో లిఫ్ట్ ఇరిగేషన్‌ను సైతం నిర్మించేందుకు ప్రపోజల్స్ రెడీ చేశారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, బజార్ హత్నూర్ మండలాలతో పాటు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాలకు తాగునీటి సమస్యతో పాటు, సుమారు 40 వేల ఎకరాలకు సాగు నీటి సమస్య కూడా దూరం కానుంది. అయితే డీపీఆర్ రూపొందించి అప్పటి ప్రభుత్వానికి పంపినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో భూసేకరణ ఆగిపోయింది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రచారానికే వాడుకొని లబ్ధి పొందింది తప్పితే నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
నిధులు కేటాయించిన కాంగ్రెస్ సర్కార్
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ చిన్న, మధ్య తరహా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తొమ్మిదేళ్లుగా ప్రపోజల్స్‌కే పరిమితం అయిన కుప్టి ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రాజెక్ట్ నిర్మాణానికి మొదటి విడతగా రూ. 234 కోట్లు కేటాయించింది. దీంతో ఆఫీసర్లు భూ సేకరణకు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు రెండు రోజుల కింద కుప్టి గ్రామ పరిసరాల్లో పర్యటించారు. అయితే తమకు ఇచ్చే పరిహారం విషయం తేల్చిన తర్వాతే భూ సేకరణ చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం సర్వే చేసేందుకు వెళ్తున్న ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు.
కడెం ప్రాజెక్టుకు భద్రత..
కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణంతో కడెం రిజర్వాయర్‌కు భద్రత ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండేళ్ల కింద కడెం ప్రాజెక్ట్‌కు రికార్డ్ స్థాయిలో ఐదు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం మూడు లక్షల క్యూసెక్కులే కాగా ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో ప్రాజెక్ట్ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ప్రతి ఏడాది ప్రాజెక్ట్‌లోకి వరద నీటితో బురద వస్తుండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. కుప్టి ప్రాజెక్ట్ నిర్మిస్తే భారీ వర్షాలు పడినప్పుడు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉంటుంది.