- గతంలో బీఆర్ఎస్ నేతల కోసం పక్కకు
- 10 ఏండ్లుగా ముందుకు పడని పాలసీ
- సామాన్యులకు తీరనున్న ఇసుక భారం
సూర్యాపేట వెలుగు: జిల్లాలో పుష్కలంగా ఇసుక అందుబాటులో ఉన్న గత ప్రభుత్వం జిల్లాలో శాండ్ టాక్సీ పాలసీని అమలు చేయకుండా పక్కన బెట్టింది. బీఆర్ఎస్ లీడర్ల సొంతలాభం కోసమే పాలసీకి అటకెక్కించి సామాన్యులను అడ్డగోలుగా దోపిడీ చేసింది. ట్రాక్టర్ ఇసుక రేటును రూ. 3వేల నుంచి రూ. 7వేల వరకు పెంచి సామాన్యులపై భారం మోపారు.
ఇసుక అక్రమం రవాణాకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నీ జిల్లాలలో శాండ్ టాక్సీ అమలు చేసేందుకు చర్యలు తీసుకుకుంది. ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటే తక్కువ ధరలో ఇసుక రవాణా చేయనున్నారు. జిల్లాలో మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయీలో శాండ్ టాక్సీ అమలులోకి రానుంది.
లీడర్ల కోసం ముందుకు పడలే
సూర్యాపేట జిల్లా ఏర్పాడిన తర్వాత 2018లో శాండ్ టాక్సీ ఏర్పాటు కోసం ఆఫీసర్లు ప్రపోజల్స్ పెట్టారు. ఇసుక బుకింగ్. రవాణా తదితర అంశాలను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ, మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లను మెంబర్లు గా నియమించారు. జిల్లాలోని వర్దమాను కోట, అనాజీపురం, నాగారంలలో ఇసుక రీచ్ లను గుర్తించి అక్కడ నుంచి రవాణా చేయాలని భావించారు.
జిల్లాలో శాండ్ టాక్సీ అమలు చేస్తామని, 2022 డిసెంబర్ 1నుంచి పాలసీ కార్యరూపంలోకి వస్తుందని అప్పటి మంత్రి ప్రకటించారు. అయితే ఇదంతా ప్రతిపాదనలకే పరిమితమయ్యింది. అప్పటిదాకా ఇసుక దందాతో లబ్ధి పొందుతున్న బీఆర్ఎస్ లీడర్లు తమకు నష్టం వస్తుందన్న ఉద్ధేశ్యంతో శాండ్ టాక్సీ అమలు కాకుండా అడ్డుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో జిల్లాలో ఇండ్లు కట్టుకోవాలను కున్నవారు తప్పని పరిస్థితుల్లో ఇసుక మాఫియా నుంచి ఎక్కువ రేట్లకు కొనుగోలు చేయాల్సివచ్చింది. పాలసీని లడ్డుకోవడంద్వా బీఆర్ఎస్ లీడర్లు మాత్రం లక్షాధికారులయ్యారన్న ఆరోపణలున్నాయి.
శాండ్ టాక్సీకి కసరత్తు
సామాన్యుల మీద భారం తగ్గించేందుకు ప్రస్తుతం శాండ్ టాక్సీ అమలు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ‘మన ఇసుక విధానం’ పేరుతో ఆన్ లైన్ ద్వారా ఇసుక ఇంటికే చేర్చానున్నారు. ఇందులో భాగంగా గతంలో గుర్తించిన చోట ఇసుకరీచ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్ సిద్దం చేశారు. పెన్ పహాడ్, నాగారం, అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం, నేరేడు చర్ల మండలాల్లో ఎక్కువగా ఇసుక లభ్యం అవుతుంది.
జిల్లాలో ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక రేటు రూ. 4 నుంచి 6వేల వరకు ఉంది. శాండ్ టాక్సీ ద్వారా క్యూబిక్ మీటర్ కు రూ.600 చొప్పున ఒక్క ట్రాక్టర్ ఇసుక కు రూ. 15వందలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇసుక సరఫరా కోసం ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్క ట్రాక్టర్ రూ.20 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.
జిల్లాలో శాండ్ టాక్సీ అమలు చేస్తాం
జిల్లాలో శాండ్ టాక్సీ అమలు చేయాలని నిర్ణయించాం. శాండ్ టాక్సీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు స్థానికులకు ఉపాధి దొరుకుతుంది. ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటే రిజిస్టర్ చేసుకున్న ట్రాక్టర్ల ద్వారా తక్కువ రేటుకే ఇసుకను ఇంటి దగ్గరికి రవాణా చేస్తాం.
తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా కలెక్టర్