రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీపికబురు.. సాదాబైనామా అప్లికేషన్లు పరిష్కరించాలని నిర్ణయం

రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీపికబురు.. సాదాబైనామా అప్లికేషన్లు పరిష్కరించాలని నిర్ణయం
  • ఆర్వోఆర్​తో సాదా బైనామాలకు మోక్షం
  • భూములు అమ్మేసిన వారికే అందుతున్న రైతుబంధు, రుణమాఫీ
  • మోకామీద ఉన్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీపికబురు
  • సాదాబైనామా అప్లికేషన్లు పరిష్కరించాలని నిర్ణయం
     
  • ముసాయిదా బిల్లులోని సెక్షన్ 6 ప్రకారం ఆర్డీవోతో విచారణ


ఆదిలాబాద్, వెలుగు: తాతలు, తండ్రుల కాలంలో భూ క్రయ, విక్రయాలకు సంబంధించి చాలా మంది రైతులు తెల్లకాగితాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా కొనుగోలు చేసిన వారు మోకా మీద వ్యవసాయం చేస్తుండగా.. అమ్మినవారు ఇంకా పట్టదారులుగా కొనసాగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే గత బీఆర్ఎస్  ప్రభుత్వం 2020 అక్టోబర్ 29 నుంచి నవంబర్ 10 వరకు సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులు స్వీకరించింది. 2014 జూన్ 2 కంటే ముందు తెల్లకాగితాలపై క్రయ, విక్రయాలు జరిపిన రైతుల దరఖాస్తులకు చట్టబద్దత కల్పించి పాస్ బుక్ జారీ చేయాలని నిర్ణయించింది. 

కానీ, ఈ ప్రక్రియ దరఖాస్తులకే పరిమితమైంది. వీటిపై బీఆర్ఎస్  కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ నాలుగేళ్లు కాలయాపనతో ముందడుగుపడలేదు. బీఆర్ఎస్  తీసుకొచ్చిన ధరణిలో అన్ని రకాల ఆప్షన్లు లేకపోవడంతో రైతులు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇందులో సాదాబైనామా దరఖాస్తులు కూడా ఒకటి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెల్లకాగితం ఒప్పందాలకు పరిష్కరించి వాటికి చట్టబద్దత కల్పించాలని నిర్ణయించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి. 

ఆర్వోఆర్‎తో గ్రీన్ సిగ్నల్..

కాంగ్రెస్  ప్రభుత్వం ఆర్వోఆర్ -2024  ముసాయిదా బిల్లులో సాదాబైనామా సమస్యలు పరిష్కరిస్తామని కొత్తం చట్టంలో పొందుపరిచింది. గత చట్టంలో స్వీకరించిన దరఖాస్తులనే కొత్తగా రూపొందించిన 2024 ఆర్వోఆర్  చట్టంలోని సెక్షన్ 6 కింద స్వీకరించిన దరఖాస్తులుగా పరిగణిస్తామని తెలిపింది. సెక్షన్ 6 కింద ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ జరిపి సరైన సాదాబైనామాలకు చట్టబద్దత కల్పించేందుకు నిర్ణయించింది. ముందుగా సాదాబైనామాల్లో ఎలాంటి అడ్డంకులు లేని దరఖాస్తులను పరిష్కరించనున్నారు. కొత్తగా దరఖాస్తులు చేసుకోవడం, ఫీజులు కట్టడం వంటివి అవసరం లేదని చెబుతున్నారు. 


దీంతో సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభిప్రాయ సేకరణ అనంతరం కొత్త చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చట్టంపై పలు జిల్లాల్లోని కలెక్టరేట్‎లో అభిప్రాయ సేకరణ పూర్తైంది. అభిప్రాయ సేకరణలో సైతం రైతు సంఘాల నాయకులు సాదాబైనామాలు పరిష్కరించాలని అధికారులను కోరారు. కాగా కొత్త చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పాత దరఖాస్తులతో పాటు కొత్తగా సాదాబైనామా క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్..

తెలంగాణాలో ప్రస్తుతం మోకాపై ఉన్న రైతులకు ఇప్పటి వరకు పట్టా పాస్ బుక్ అందలేదు. దీంతో అవే తెల్ల కాగితాలపై వ్యవసాయం చేసుకుంటున్న వీరికి 2020 ధరణి రూపంలో మరో కొత్త సమస్య వచ్చింది. భూములు విక్రయించిన వారిపైనే కొత్త పాస్ బుక్‎లు వచ్చాయి. వారికే రైతుబంధు, రుణమాఫీ, ఇతర పథకాలు అందుతున్నాయి. దీంతో తెల్లకాగితాలపై భూములు సాగు చేసుకుంటున్న రైతులు వాటిపై హక్కులు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ధరణిలో సాదాబైనామా సమస్యకు ఆప్షన్ లేకపోవడంతో ఏండ్లుగా దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. 2016లో మొదటి సారి రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాలను క్రమబద్దీకరించింది. అప్పుడు 11.19 లక్షల దరఖాస్తులు రాగా, 6.15 లక్షల దరఖాస్తులను పరిష్కరించి పట్టాలు జారీ చేసింది. 

3 లక్షల దరఖాస్తుల్లో ఆధారాలు లేవని తిరస్కరించగా, మిగతా 2.4 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉంచింది. ఆ తర్వాత 2020లో అవకాశం కల్పించి దరఖాస్తులు తీసుకున్నారు. ఆర్వోఆర్ 1971 చట్టం అమలులో ఉన్నప్పుడు 2.4 లక్షల దరఖాస్తులు, 2020 కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తీసుకున్న దరఖాస్తులు 7.20 లక్షలతో కలిపి 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్‎లో ఉన్నాయి. 2020 అక్టోబర్ 29న కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రావడంతో ఈ చట్టంలో తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులకు సాదాబైనామాలను పరిష్కరించే అధికారాలు కట్టబెట్టలేదు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతనే రెండో సారి దరఖాస్తులు స్వీకరించిన బీఆర్ఎస్  ప్రభుత్వం ఆ చట్టంలో సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించే వెసులుబాటు కల్పించకపోవడం గమనార్హం. అటు ధరణి వెబ్ సైట్‎లోనూ ఆప్షన్ లేకపోవడంతో దరఖాస్తులు పెండింగ్‎లోనే ఉండిపోయాయి.  

ఏండ్లుగా మోకా మీద ఉన్నా..

ఏండ్లుగా మోకా మీద ఉన్న సాదాబైనామా రైతులకు పర్మినెంట్ పట్టాకు మోక్షం కలగడం లేదు. 1948 నుంచి 1970 వరకు సాదాబైనామాలు తహసీల్దార్లు క్రమబద్దీకరించేవారు. అనంతరం అప్పటి సర్కార్​ 1948 చట్టాన్ని సవరించి 1971 చట్టం అమల్లోకి తెచ్చింది. దీంతో కొత్త చట్టంలో తీసుకొచ్చిన నిబంధనలతో తెల్లకాగితాలపై రాసుకున్న ఒప్పందాల లావాదేవీలు నిలిచిపోయాయి. భూమి కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్  డాక్యుమెంట్లు ఉండాలనే నిబంధనతో సాదాబైనామాకు బ్రేక్ పడింది. కాగా, 1989లో ఈ చట్ట సవరణ చేసి మళ్లీ తహసీల్దార్లకు క్రమబద్దీకరణ అధికారం  కల్పించారు. 

1989, 2000, 2016, 2020 నాలుగు సార్లు సాదాబైనామా క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులు స్వీకరించారు. అయితే 2020 కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత తహసీల్దార్లకు మరోసారి క్రమబద్దీకరణ చేసే అవకాశం లేకుండా పోయింది. ధరణి వచ్చిన తర్వాత డిజిటల్  రికార్డులనే రెవెన్యూ రికార్డులుగా చూస్తున్నారు. దీంతో సాదాబైనామా క్రమబద్దీకరించాలంటే 2020 ఆర్వోఆర్  చట్టాన్ని సవరించాలని గతంలోనే డిమాండ్ లు వచ్చాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్​  ప్రభుత్వం 2024 ఆర్వోఆర్  చట్టంలో సాదాబైనామా దరఖాస్తులను క్రమబద్దీకరించాలని నిర్ణయించడంతో నాలుగేండ్ల తరువాత వాటికి మోక్షం కలగనుంది.