హైదరాబాద్: దీపావళి పండుగ వేళ గవర్నమెంట్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్లో ఉన్న రెండు డీఏల (కరువు భత్యం) విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం (అక్టోబర్ 26) సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక డీఏ వచ్చే నెల వేతనంతో.. మరో డీఏ మార్చిలో ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. పండుగ వేళ పెండింగ్లో ఉన్న రెండు డీఏ విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఉద్యోగులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :- స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముందుకొచ్చిన మెఘా.. ప్రభుత్వంతో ఎంవోయూ
డీఏల విడుదలతో పాటు ఈ భేటీలో కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి ఎకరా రూ.250 చొప్పున 211 ఎకరాల భూమి కేటాయింపు, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుకు మంత్రి మండలి ఒకే చెప్పింది. దీంతో పాటుగా.. ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. దీంతో ఏటూర్ నాగారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు బాణా సంచాలు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.