అర్హులైన ప్రతి ఒక్కరికీ .. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ .. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు

ఖానాపూర్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుంటోందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చెప్పారు. గురువారం ఖానాపూర్ తహసీల్దార్ ఆఫీస్ అవరణలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఖానాపూర్ పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీలోని మహాదేవ అన్నపూర్ణ ఆలయంలో జరిగిన కాలభైరవ స్వామి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు దయానంద్, రమేశ్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మాజిద్, తదితర నాయకులు పాల్గొన్నారు.

చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం..

సదర్​మాట్ ఆనకట్ట కింద రైతులు సాగుచేస్తున్న పంటలకు యాసంగి సీజన్​లో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్​మాట్ ఆనకట్ట నుంచి కెనాల్ ద్వారా గురువారం నీటిని విడుదల చేశారు. నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలని ఆయన సూచించారు. సర్పంచ్ రాజేందర్ నాయక్, కడెం ఎంపీపీ అలెగ్జాండర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పల శంకర్, ఎంపీటీసీ జంగిలి శంకర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.