- ఏటా ముంపుతో విలవిల్లాడుతున్న భద్రాద్రి.. దిద్దుబాటు చర్యల్లో సర్కారు
- వరదను గోదావరిలోకి ఎత్తిపోసేందుకు బాహుబలి మోటార్ల ఏర్పాటు!
- పాత కరకట్ట స్లూయిజ్‌లకు రిపేర్లు
- శరవేగంగా 700 మీటర్ల కరకట్ట నిర్మాణం
భద్రాచలం, వెలుగు : ఈ వర్షాకాలంలో భద్రాద్రిని వరదల గండం నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర సర్కారు పక్కాగా ప్లాన్ చేస్తోంది. గతంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా భద్రాచలం ముంపుతో విలవిల్లాడింది. ఈ నేపథ్యంలో ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు శరవేగంగా చేపడుతోంది.
ఈ మూడు నెలలు భయం.. భయం..
వరదలు ఎక్కడ ముంచెత్తుతాయోనని జూన్, జులై, ఆగస్టులో గోదావరి తీర ప్రాంత వాసులు భయం.. భయంగా బతుకుతుంటారు. వరదలు ఊళ్లపై పడి ఇళ్లను, పంటలను మింగేస్తాయి. 2022 జులైలో వచ్చిన 71.3 అడుగుల వరద 78 గ్రామాలను ముంచింది. 15,465 కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. 10,831 ఎకరాల పంటలనూ ఊడ్చేయడంతో 5,047 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2023లోనూ వరదలు కలవరపెట్టాయి. మళ్లీ ఇప్పుడు జూన్ ప్రారంభం కావడం, రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తుండటంతో జనం గుండెల్లో భయం పట్టుకుంది.
ఇరిగేషన్ ఇంజినీర్లు అలర్ట్
ఏటా వరదల్లో భద్రాద్రి ముంపు విషయంలో ఇరిగేషన్ ఇంజినీర్లే కీలకం. వరుసగా వర్షాలు కురిస్తే కట్టపై ఉన్న స్లూయిజ్‌లు మూస్తే వర్షపు నీరు మొత్తం ఆలయం చుట్టూ చేరుతుంది. దీంతో ఈ నీటిని గోదావరిలోకి ఎత్తిపోసేందుకు అధికారులు బాహుబలి మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మోటార్లు తెప్పించారు. సింగరేణి నుంచి రెస్క్యూ టీమ్‌లతో పాటు, భారీ మోటార్లు తీసుకొస్తున్నారు. పాత కరకట్టపై ఉన్న స్లూయిజ్‌లు లీక్ కాకుండా పాత గేట్లుతీసి కొత్తవి ఏర్పాటు చేశారు. గేట్లకు ఆయిలింగ్, రబ్బర్ సీల్స్ పెట్టారు. ప్రతీ స్లూయిజ్ వద్ద మోటార్లు రెడీ చేస్తున్నారు.
విస్తా కాంప్లెక్స్ వద్ద ఆరు కొత్త మోటార్లు, నాలుగు పాత మోటార్లు మొత్తం 400 హార్స్ పవర్ మోటార్లు పెడుతున్నారు. 250 హెచ్‌పీ మోటార్లు రెండు రెంటల్ పద్ధతిలో తీసుకురానున్నారు. కొత్త కాలనీ వద్ద ఇప్పటి వరకు 70 హార్స్ పవర్ మోటార్లు ఉన్నాయి. ఈసారి 20 హెచ్‌పీ, 25హెచ్‌పీ మోటార్లు కొత్తవి కొనుగోలు చేశారు. ఏటా కూనవరం రోడ్డు నుంచి వరద టౌన్లోకి ప్రవేశిస్తోంది. 700 మీటర్ల పొడవున రూ.38కోట్లతో కొత్త కరకట్ట నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అక్కడ ఒక స్లూయిజ్ నిర్మాణం కూడా చేస్తున్నారు. 11మీటర్ల ఎత్తైన కట్ట పనులు పూర్తికావొచ్చాయి. ఈ కట్ట పూర్తయితే టౌన్ సేఫ్ జోన్లోకి చేరుతుంది.
ఎన్నికలతో రివ్యూ మీటింగ్‌ల్లో డిలే..
గోదావరి వరదలు, వానల గురించి ఏటా భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధికారులతో భద్రాచలంలో రివ్యూ మీటింగ్‌లు పెట్టాలి. ఫ్లడ్ మాన్యువల్ ప్రకారం ఈ మీటింగ్‌లు తప్పనిసరి. కానీ ఈసారి వరుస ఎన్నికలు, ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో జిల్లా కలెక్టర్‌తో సహా ఆఫీసర్లంతా బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేకపోయారు. ఈలోపే కలెక్టర్, ఐటీడీఏ పీవోల బదిలీలు జరిగాయి. ప్రస్తుతం కొత్త కలెక్టర్ రావడంతో రివ్యూ మీటింగ్ పెట్టే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
వరదలను ఎదుర్కొనేందుకు రెడీ..
వరదలను ఎదుర్కొనేందుకు రెడీ గా ఉన్నాం. ఇప్పటికే పాత కరకట్టలపై ఉన్న స్లూయిజ్‌లకు రిపేర్లు చేశాం. వర్షపు నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు పెట్టాం. కట్ట వెంబడి ఇసుక బస్తాలను పెడుతున్నాం. కొత్త కరకట్ట నిర్మాణం జరుగుతోంది. ఇది వరదల నాటికి కంప్లీట్ చేస్తాం.
రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్, భద్రాచలం