ప్రజాప్రభుత్వం.. అన్ని మతాలను గౌరవిస్తుంది : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని మతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గంగా, జమున సంస్కృతి మరింతగా పరిఢవిల్లేలా పాలన చేపడుతుందని పేర్కొన్నారు. బుధవారం సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ  సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మంత్రి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నమ్మకాలు, మనోభావాలను గౌరవిస్తుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ధ్వంసమైన ముత్యాలమ్మ విగ్రహస్థానంలో 250 కిలోల పంచలోహాలతో నూతన విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు చెప్పారు. ఆలయంలో నవీకరణ పనులు చేపట్టి వైభవంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. ప్రజలు, భక్తులు సంయమనంతో వ్యవహరించి, విగ్రహ పునఃప్రతిష్టకు సహకరించారని ప్రశంసించారు.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని మతాలు, సంస్కృతుల సమ్మేళనంతో మినీ ఇండియాగా వర్ధిల్లుతున్న హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెంచేలా కార్యాచరణను రూపొందిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని మతాల ప్రజల విశ్వాసాలు, సంస్కృతి, సంప్రదాయాలు, మనోభావాలకు ప్రాధాన్యమిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి, కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ తదితరులు పాల్గొన్నారు.